టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాజకీయాలలో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పర్యటనలు ఒక వైపు...స్వదేశంలో ప్రజలతో మమేకమయ్యేందుకు చేసే ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు మరో వైపు...ఒక్క ముక్కలో చెప్పాలంటే లోకేశ్ కు క్షణం తీరిక ఉండదు. అయినా సరే, లోకేశ్ తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఏ మాత్రం వీలు చిక్కినా సరే అస్సలు వదులుకోరు. ప్రత్యేకించి తన కుమారుడు నారా దేవాన్ష్ కు సంబంధించిన కార్యక్రమాలను లోకేశ్ అస్సలు మిస్ కారు.
ఈ క్రమంలోనే ఈ రోజు దేవాన్ష్ తో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లోకేశ్ శ్రీహరికోట చేరుకున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన చరిత్రాత్మ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జరుగుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తండ్రికొడుకుల మధ్య ఇదో మరపురాని రోజు అని లోకేశ్ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల్లో ఇదో కీలక ఘట్టం అని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు ఈ ప్రయోగం ఊతమిస్తుందని లోకేశ్ చెప్పారు. ఈ క్రమంలోనే దేవాన్ష్ తో కలిసి దిగిన ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.