టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాచురల్ స్టార్ నాని, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూట్ మార్చారు. కేవలం కంటెంట్ నమ్ముకునే కాకుండా, కమర్షియల్ మార్కెట్‌ను సైతం షేక్ చేసే రేంజ్‌కు ఎదిగారు. ‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో నాని చేస్తున్న సరికొత్త పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా.. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టే బిజినెస్ వర్గాల్లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ట్రేడ్ పండితులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం.. విడుదలకు ముందే టాలీవుడ్(Tollywood) వ్యాపార వర్గాల్లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కేవలం నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల కోసమే మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఏకంగా రూ. 37 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని సినీ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ మరియు రికార్డు స్థాయి డీల్ కావడం విశేషం. కేవలం ఒకే ఒక్క రీజియన్ నుండి ఈ రేంజ్ ఆఫర్ వచ్చిందంటే, రాబోయే రోజుల్లో మిగతా ఏరియాల బిజినెస్ ఏ రేంజ్‌లో ఊచకోత కోయబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని(Nani) మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కాయదు లోహర్ నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ నానిని ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది.
మరోవైపు, ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న సంగీతం ‘ది ప్యారడైజ్(The Paradise)’కు అతిపెద్ద అసెట్‌గా మారబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన "ఆయా షేర్" సాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను ఊపేస్తోంది. కేవలం పాటలతోనే కాకుండా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. సెప్టెంబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ ప్యారడైజ్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.