అధినేత మాటే వేదం.. ఆయన గీసిన గీత దాటే సాహసం చేయని నాయకులే ఆ పార్టీలో ఉంటారనేది ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ టాక్. ముఖ్యంగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నిర్ణయాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరని అందరూ భావిస్తుంటారు. అయితే, శ్రీకాకుళంలో చోటుచేసుకున్న ఒకే ఒక ఘటన ఇప్పుడు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఒకవైపు పార్టీ అధికారికంగా ఈ వివాదాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు సొంత సీనియర్లే తెగించి విమర్శలకు దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీకాకుళం(Srikakulam)లో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లిక పట్ల జరిగిన వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒక మహిళా అధికారినని చూడకుండా ఆమెను చుట్టుముట్టి గేలి చేయడం, దుర్భాషలాడటమే కాకుండా తోసే ప్రయత్నం చేయడం వంటి పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వివాదంపై అధికారికంగా పార్టీ శ్రేణులు ఒక రకమైన వాదన వినిపిస్తుండగా, సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీ నేతల గొంతులోంచి ఊహించని నిరసన స్వరాలు వెలువడటం విశేషం.
ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఏసీపీ చంద్రగిరి ఏసురత్నం ఏకంగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేయడం పార్టీలో కలకలం రేపింది. మాజీ పోలీసు అధికారిగా తాను ఈ దారుణాన్ని క్షమించలేనని, మహిళా ఎస్సైపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏపీ పోలీసు సంఘానికి బహిరంగంగా సంఘీభావం తెలపడం ద్వారా ఆయన పార్టీ లైన్‌కు భిన్నంగా అడుగులు వేశారు. ఇటు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) సైతం శ్రీకాకుళం ఘటనను తప్పుబట్టడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. పోలీసులతో వాదనకు దిగడం, మహిళా అధికారితో అనుచితంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేయడం వైసీపీలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి వైసీపీ(YCP)ని చుట్టుముట్టింది. ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టాల్సిన తరుణంలో, స్వయంగా సొంత పార్టీకి చెందిన పోలీసు నేపథ్యం ఉన్న ఎమ్మెల్సీ, సీనియర్ నేతలే బహిరంగంగా తప్పుపట్టడంతో పార్టీ నాయకత్వం ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది. ఈ అసమ్మతి స్వరం ఇక్కడితో ఆగుతుందా? లేక భవిష్యత్తులో పార్టీలోని మరికొన్ని అంతర్గత విభేదాలను బయటపెట్టేలా మలుపు తిరుగుతుందా? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత జగన్ దీనిపై ఎలాంటి సమీక్ష చేస్తారు, అసంతృప్తి నేతలకు ఎలా చెక్ పెడతారనేది వేచి చూడాలి.