సినిమా రంగం(Film Industry) ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఒక్క అవకాశం జీవితాన్నే తలకిందులు చేస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఆ రంగుల వెనుక దాగి ఉన్న కఠిన నిజాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని మెప్పించిన ఓ నటుడు.. నేడు కుటుంబ పోషణ కోసం ఆటో స్టీరింగ్ పట్టాల్సిన పరిస్థితి రావడం నిజంగా హృదయ విదారకం.
తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ మూవీ 'సుబ్రమణ్యపురం(Subramaniapuram)'. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన మారిముత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఆయన పోషించిన 'దమ్‌ఖాన్' పాత్ర ప్రేక్షకులకు ఇట్టే గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఆయన చెప్పిన సంభాషణలు అప్పట్లో ట్రెండ్‌ను సృష్టించాయి. ఆ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది.

అయితే, ఇంతటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించినప్పటికీ మారిముత్తు(Marimuthu) కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. మదురైకి చెందిన ఈ నటుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పరిశ్రమలోకి వచ్చారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, కేవలం మూడో తరగతి వరకే చదువుకున్న ఆయన.. బ్రతుకుదెరువు కోసం రేడియో రిపేర్ షాప్‌లోనూ పనిచేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ ఒక్క సినిమా గుర్తింపు ఆయనకు శాశ్వత ఉపాధిని మాత్రం ఇవ్వలేకపోయింది.
సినిమా అవకాశాలు పూర్తిగా కరువవడంతో, కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన వేరే మార్గం వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం చెన్నై(Chennai) వీధుల్లో ఆయన ఆటో నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు వెండితెరపై వెలిగిన నటుడు, నేడు జీవనం కోసం ఇలా కష్టపడుతుండటం చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఎవరి ముందూ చేయి చాచకుండా, సొంత కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఆయన పట్టుదల ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. త్వరలోనే ఆయనకు మళ్లీ మంచి అవకాశాలు రావాలని, పూర్వ వైభవం దక్కాలని ఆయన శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు.