ఒకప్పుడు లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన చేతుల్లో ఖాకీ డ్రెస్.. ఆ తర్వాత దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన కొందరి నేతల ప్రస్థానం కాలక్రమేణా ఎలా పతనమవుతుందో చెప్పడానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla Madhav) ప్రస్తుత రాజకీయ జీవితమే ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక ప్రైవేట్ వీడియో వివాదం, ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో పార్టీ టికెట్ కోల్పోయిన ఆయన, ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా తెరమరుగయ్యే స్థితికి చేరుకున్నారు.
2019 వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభంజనంలో ఊహించని రీతిలో హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన గోరంట్ల మాధవ్, తన పదవీకాలంలో వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే అపవాదు మూటగట్టుకున్నారు. విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం, నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ అధిష్ఠానం ఆయనకు షాక్ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా ఆయనకు టికెట్ నిరాకరించింది. ఆ తర్వాత సానుభూతి కోసమో ఏమో కానీ, నామమాత్రంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టి చేతులు దులుపుకుంది.
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. తాడేపల్లి(Tadepalle)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీసం ఒక్క అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఆయనను ఇన్‌చార్జ్‌గా నియమించలేదు. సొంత జిల్లాలో పట్టు కోల్పోయి, పార్టీలోనూ నామమాత్రపు పాత్రతో మిగిలిపోవడంతో మాధవ్‌లో తీవ్ర అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోంది. తాను ఇంకా రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆయన పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
జిల్లాలో ఎక్కడ ఏ నిరసన కార్యక్రమం జరిగినా, ఏ పార్టీ పరమైన ధర్నా తలపెట్టినా పిలుపుతో సంబంధం లేకుండా మాధవ్ అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. రాప్తాడు(Raptadu) నుంచి ఉరవకొండ వరకు ఎక్కడ రోడ్డెక్కినా ఆయన హడావుడి మాత్రం మామూలుగా ఉండటం లేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగడం, బలవంతపు అరెస్టులు ఎదుర్కొవడం, ఆ క్రమంలో కొత్త కేసులు మూటగట్టుకోవడం ఆయనకు నిత్యకృత్యమైపోయింది. కేవలం మీడియా కెమెరాల ముందుకు వచ్చి పలకరించడం, సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకోవడం మినహా ఈ హడావుడి వల్ల ఆయనకు ఒరిగేదేమీ లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
సొంత పార్టీ నేతలే ఆయన తీరుపై పెదవి విరుస్తున్నారు. కేవలం ఆవేశపూరిత మాటలు, డ్రామాలతో రాజకీయాల్లో నెగ్గుకురావడం సాధ్యం కాదని, క్షేత్రస్థాయిలో కేడర్‌ను కూడగట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఒక గౌరవప్రదమైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్, నేడు ఇటు పదవి లేక, అటు అధినేత జగన్(Jagan) ఆశీస్సులు కరువై తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కేవలం అరెస్టులు, పోలీసు కేసుల చుట్టూ తిరుగుతున్న ఆయన పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడంతో.. నిజంగానే గోరంట్ల రాజకీయ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది.