గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఫైనల్‌గా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించారు. ఆయన తాజాగా నటించిన విభిన్న కథాచిత్రం 'కొరియన్ కనకరాజు'తో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ మొదటి ఆట నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాలు టాలీవుడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రీమియర్లు, మొదటి రోజు కలుపుకుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ భారీ నంబర్లతో వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇప్పటివరకు టాప్ ఓపెనర్‌గా ఉన్న 'గద్దలకొండ గణేష్' రికార్డును 'కొరియన్ కనకరాజు(Korean Kanakaraju)' అధిగమించింది. వరుస ఫ్లాప్‌లతో డీలా పడిన మెగా అభిమానులకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ కొండంత బలాన్నిచ్చాయి.
కొరియా నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు వచ్చే ఒక వింత ఆత్మ చుట్టూ తిరిగే కథాంశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు థ్రిల్ చేస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ రోల్‌లో అదరగొట్టగా, ఆయన సరసన రితిక నాయక్(Ritika Nayak) గ్లామర్‌తో మెప్పించారు. ఇక కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎస్.ఎస్. తమన్ అందించిన నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తొలి రోజే రికార్డులు బద్దలు కొట్టడంతో ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ జోరు చూస్తుంటే లాంగ్ వీకెండ్‌లో కలెక్షన్ల సునామీ మరింత భారీగా ఉండేలా కనిపిస్తోంది.