ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ఒకే ఒక ప్రధాన అస్త్రం.. మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రాజీనామా. గత కొన్ని రోజులుగా పార్టీ శ్రేణులు ఈ డిమాండ్‌ను గట్టిగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనే దానిపై ఇప్పుడు సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. అసలు లోకేష్‌ను టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ ఆశిస్తున్న ఫలితం దక్కుతుందా? లోకేష్‌తో రాజీనామా చేయించడం వైసీపీకి సాధ్యమేనా? అనే చర్చ తీవ్రతరమైంది.
చంద్రబాబు(Chandrababu) తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో లోకేష్‌పై ప్రత్యర్థులు చేసిన విమర్శలు వేరు. కానీ కాలక్రమేణా ఆయన తన రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే, ప్రస్తుతం లోకేష్ రాజకీయ దూకుడు పెంచడమే కాకుండా, అసెంబ్లీలోనూ, బయటా బలంగా గళం వినిపిస్తున్నారు. పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి వైసీపీ అగ్రనేతలకు సైతం సవాల్‌గా మారుతోంది. నేరుగా రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి డిమాండ్ల ద్వారా దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపుతున్నారనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు, యువతను ఆకర్షించడంలో, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో, ఉద్యోగ కల్పనపై లోకేష్ చూపుతున్న చొరవ నేటి యువతరాన్ని బలంగా ఆకట్టుకుంటోంది. డీఎస్సీ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందనే వాదన నిరుద్యోగుల నుంచీ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు హైకోర్టు సైతం ఈ వివాదానికి సంబంధించిన కేసులను కొట్టేయడంతో, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌లో ఎలాంటి లాజిక్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాదరణ పొందుతున్న యువ నాయకుడిపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజల్లో సానుభూతి రావడానికి బదులుగా, రివర్స్ ఎఫెక్ట్ తగులుతుందని వైసీపీ(YCP) సీనియర్లే అంతర్గతంగా మధనపడుతున్నారు. బరితెగించి చేసే ఇలాంటి పోరాటాలు ఏమాత్రం వర్కౌట్ కావని, ఇది పూర్తిగా వృథా ప్రయాసే అవుతుందని పార్టీలోనే కొందరు బాహాటంగానే విశ్లేషిస్తున్నట్లు టాక్.