మెగాస్టార్ చిరంజీవి ఏదైనా సినిమా వేడుకలకు హాజరైనపుడు పొరపాటున తన కొత్త చిత్రం విశేషాలను బయటపెట్టేయడం చాన్నాళ్లుగా నడుస్తున్న వ్యవహారమే. కొన్నేళ్ల ముందు ఆచార్య టైటిల్ విషయంలో ఇలాగే నోరు జారారు. తర్వాత మరి కొన్ని సందర్భాల్లో ఇలాగే జరిగింది. దీంతో ఈ విషయంలో తన మీద తానే సెటైర్లు వేసుకోవడం చూశాం. చిరు ఇలా తొందరపడి విశేషాలను బయటపెట్టేయడం మీద చిరు లీక్స్ పేరుతో మీమ్స్ కూడా వస్తుంటాయి.
బాబీ కొల్లి దర్శకత్వంలో తన కొత్త చిత్రం మొదలైనపుడు కూడా టీం ఒక ఫన్నీ వీడియో చేయగా.. అందులో తొందరపడి చిరు టైటిల్ చెప్పేయబోతే బాబి అడ్డుకోవడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కానీ బాబి అప్పుడు అడ్డుకున్నాడు కానీ.. ఇప్పుడు చిరు మాత్రం ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు.
తన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరు.. అనుకోకుండా తన కొత్త సినిమా టైటిల్లో కొంత భాగాన్ని బయటపెట్టేశారు. చిరు లీక్స్ ఏమైనా ఇస్తారా అని యాంకర్ అడిగితే.. చిరు మైక్ అందుకుని మాట్లాడుతూ, తనకు దగ్గర్లో కూర్చున్న తమన్‌తో సంభాషణ సాగించారు. ఆగస్టు 22న తన పుట్టిన రోజు కానుకగా రాబోతున్న సినిమాకు బీజీఎం పని అయిపోయిందా అని అడిగిన చిరు.. అందులో టైటిల్ వేశారా అని ప్రశ్నించాడు.
తమన్ ఔనని బదులివ్వగా.. మరి అందులో పేరు ఇలా వేశారా అని అంటూ కదిరి పదాన్ని పలికిన చిరు.. వెంటనే ఆగిపోయారు. మరోవైపు తమన్ అక్కడితో ఆపేయండి అనడంతో చిరు ఊరుకున్నారు. దీన్ని బట్టి చిరు కొత్త సినిమా టైటిల్లో కదిరి అని ఉంటుందన్నది స్పష్టం. బహుశా కదిరి నరసింహుడు తరహాలో టైటిల్ ఉండొచ్చనిపిస్తోంది. మరి చిరు పుట్టిన రోజుకు రిలీజ్ చేసే టైటిల్లో ఏం విశేషం ఉంటుందో చూడాలి.