ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ఈ రోజు ప్రారంభమైంది. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి డెవలప్మెంట్ లో ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు.
3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం 'మూడు ముక్కలాట' ఆడిందని, ఏపీ భవిష్యత్తు పూర్తిగా విధ్వంసానికి గురయిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపి, 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే అమరావతిని చంపేయాలని జగన్ చూశారని, ఈ క్రమంలో రైతుల త్యాగాలను అవమానించారని మండిపడ్డారు.
"మేము ప్రపంచ స్థాయి నమూనాలతో ఐకానిక్ భవనాలు ప్లాన్ చేస్తే, వాటన్నిటినీ గ్రాఫిక్స్ అన్నారు. ఆ గ్రాఫిక్స్ నిజమైతే వారి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రారంభమైన ఈ రాజమార్గమే వారికి సమాధానం చెబుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి రైతుల ఉద్యమమే. మీరు పడిన కష్టాలు నేను కళ్లారా చూశాను. మీకు అండగా నిలవడానికి పార్టీ ఖాతాలో డబ్బులు లేని సమయంలో నేను జోలె పట్టి డబ్బులు వసూలు చేసి న్యాయపోరాటానికి సహకరించాను.
నా భార్య సైతం తన చేతి గాజులు తీసి ఉద్యమానికి విరాళంగా ఇచ్చింది. అలాంటి మీ త్యాగాల పునాదులపైనే ఈ రాజధాని మళ్లీ నిలబడుతోంది. మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తు. చిన్న చిన్న న్యాయపరమైన అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టును ఆపాలని చూసినా, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం కూడా తమ వంతు సహకారం అందించింది.’’ అని చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగించారు.