మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు క్రిప్టిక్ పోస్టులతో తన బ్రేకప్ వ్యవహారం గురించి ఆమె హింట్ ఇచ్చింది. తర్వాత మీడియా వాళ్లు దీని గురించి అడిగితే.. ఇంకాస్త ఓపెన్ అయింది. ఇప్పుడు తాను అన్ని బాధల నుంచి బయటపడి మంచి స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.
మీ వ్యక్తిగత విషయాల గురించి పోస్టులు ఎందుకు పెట్టారు అని అడిగితే.. నా సోషల్ మీడియా ఖాతాలో నాకు నచ్చింది పోస్ట్ చేసకుంటా అని సమాధానం ఇచ్చిందామె. అంత వరకు ఓకే కానీ.. ఇప్పుడు ఇంటర్వ్యూలో తన ముగిసిన ప్రేమాయణం గురించి, ఎక్స్ లవర్ గురించి చేస్తున్న వ్యాఖ్యల పట్ల మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఎవరి గురించి అంటోందన్నది అందరికీ అర్థమైపోతోంది.
ఆ వ్యక్తి క్యారెక్టర్‌ను దెబ్బ తీసేలా, తన కెరీర్ మీద కూడా ప్రభావం చూపేలా అనుపమ మాటలు ఉంటున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్స్ లవర్‌ను అపరిచితుడు అంటూ తన వ్యక్తిత్వం గురించి విశదీకరించి చెప్పడం.. తన ఫ్యామిలీ హడావుడిగా తమకు నిశ్చితార్థం చేసేయాలని చూసిందని, తన సినిమాను తాను ప్రమోట్ చేసుకోనివ్వలేదని అనడం.. ఇవన్నీ తీవ్ర ఆరోపణలే. ఐతే ఇదంతా అనుపమ వెర్షన్ మాత్రమే. ఇందులో నిజాలుండొచ్చు. కొన్ని అతిశయోక్తులూ ఉండొచ్చు. అవతలి వ్యక్తి వెర్షన్ ఏంటన్నది కూడా తెలిస్తేనే ఒక అంచనాకు రాగలం. కానీ ఆ వ్యక్తి కూడా ఇలా బయటికి వచ్చి ఈ టాపిక్ మీద మాట్లాడితే, ఇలాంటి ఆరోపణలు చేస్తే వ్యవహారం పెద్ద రభస అవడం ఖాయం. మొదట్నుంచి మౌనం వహిస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు కూడా సైలెంటుగానే ఉన్నాడు.
అనుపమ విషయంలో ఆ వ్యక్తికి కూడా కొన్ని అభ్యంతరాలు ఉండకపోవు. అతను తప్పుబట్టే విషయాలూ చాలానే ఉండొచ్చు. అయినా ఒక వ్యక్తి నచ్చకపోవడంతో ఆ బంధం నుంచి బయటికి వచ్చేశాక మూవ్ ఆన్ అయిపోవాలి కానీ.. ఆ వ్యక్తిగత వ్యవహారం గురించి మీడియాలో మాట్లాడి ఆ వ్యక్తి క్యారెక్టర్‌ను, కెరీర్‌ను దెబ్బ తీయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న. అనుపమను సమర్థించేవాళ్లు చాలామందే ఉన్నప్పటికీ.. ఆమె ఇలా చేయడాన్ని తప్పుబడుతున్న వాళ్లు కూడా సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కనిపిస్తున్నారు.