ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు బంపరాఫర్ ఇచ్చారు. సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ రావాలని కోరారు. అయితే.. ఈ మాటను ఆయన ఎప్పటి నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దీనికి మరో ఆఫర్‌ను కూడా జోడించారు. ``జగన్ సభకు రావాలని కోరుకుంటున్నా. ఆయన సభకు వస్తే.. ఆయన ప్రస్తావిస్తున్న ప్రతి విషయానికీ.. సమాధానం చెప్పిస్తా.`` అని స్పీకర్ ఆఫర్ ఇచ్చారు.
అంతేకాదు.. ``జగన్ ఇప్పుడు డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారు. రోడ్డుమీద ఎందుకు ఆయన మాట్లాడాలి. ఆయన సభకు రావాలి. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజల సమస్యలపై స్పందించాలి. ప్రశ్నించాలి. ఒక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు ఎంత సమ యం ఇస్తున్నామో.. ఆయనకు కూడా అంత సమయం ఇచ్చే బాధ్యత నాది. ఆయన పట్ల సభకు గౌరవం ఉంది. ఆయన దానిని నిలబెట్టుకోవాలి. ప్రజల సమస్యలపై ఎక్కడో మాట్లాడడం కాదు. సభలో మాట్లాడితే.. మంత్రులతో నేను సమాధానం చెప్పిస్తా. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే వరకు సభను వాయిదా వేయకుండా కూడా చూస్తా`` అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
బెంగళూరు నుంచి తాడేపల్లికి..
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్.. బెంగళూరు నుంచి తాడేపల్లి కి సోమవారం ఉదయం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. సభకు మాత్రం వెళ్లరని.. పార్టీ కార్యాలయంలోనే మధ్యాహ్నం 12 తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శాసన మండలికి మాత్రం వైసీపీ సభ్యులు వెళ్తారని తెలిపారు. డీఎస్సీ అంశం సహా.. ప్రజల సమస్యలపై స్పందిస్తారని వివరించారు. సభలో జగన్‌ను అవమానించే చర్యలను తాము ఖండిస్తామన్నారు. మరోవైపు.. అసెంబ్లీ, శాసన మండలి కార్యక్రమాల నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.