ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్ రువ్వారు. ``ఖబడ్దార్`` అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ``దమ్ముంటే.. సభకు రావాలి. ఏ విషయంపైనైనా చర్చించేందుకు సమాధానం చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.`` అంటూ.. సభా వేదికగా ఆయన వైసీపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కూటమిని బలహీన పరచాలన్నా.. విశ్వసనీయతను దెబ్బతీయాలన్నా.. ప్రజల్లో పలుచన చేయాలన్నా.. వైసీపీకి తరం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలే తేల్చుకుంటారని.. వారి ముందు అన్ని విషయాలు ఉంచామన్నారు.
సోమవారం తొలిరోజు సభ ప్రారంభమైన తర్వాత.. మంత్రి నారా లోకేష్ డీఎస్సీ-2025పై వైసీపీ నాయకులు గత కొన్నాళ్లుగా చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు. దానిని ఎలా నిర్వహించామో ఆయన వివరించారు. అనంతరం.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభకు వచ్చిన చంద్రబాబు.. వచ్చీ రావడంతోనే విద్యా విషయంపై తనదైన శైలిలో ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన ఏకధాటిగా ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత ఏపీ వరకు, ఎన్టీఆర్ కాలం నుంచి తన పాలన వరకు విద్యకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయంగా చాలా సునిశితంగా వ్యవహరించారని చెప్పిన ఆయన.. తన హయాంలో జరిగిన అనేక డీఎస్సీల్లో ఒక్కదానిని కూడాఆయన తప్పుబట్టలేదన్నారు. అలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రంలో తొలిసారి రెసిడెన్షియల్ విధానం తీసుకువచ్చారని.. తన హయాంలో వీటిని బలోపేతం చేశామన్నారు. ఇక, డీఎస్సీలు నిర్వహించి తన హయాంలో ఎంపికైన 80 శాతం మంది ఉపాధ్యాయులే నేటికీ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఏనాడూ ఎవరూ తనను తప్పుబట్టలేదన్నారు.
వైసీపీకి పనీపాట లేకుండా.. డీఎస్సీపై విమర్శలు చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీని ఎలా నిర్వహించామ నే రహస్యమేమీ కాదన్నారు. అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టామని తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తుల నుంచి పరీక్షల వరకు, సర్టిఫికెట్ల పరిశీలన నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు అన్ని విషయాలు ప్రజల ముందు ఉన్నాయన్నారు. కానీ, కూటమి ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ డీఎస్పీపై అవాకులు చవాకులు పేలుతోందన్నారు. సభకు రాకుండా తప్పించుకుని తిరుగుతూ.. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
``వైసీపీకి ఒక్కటే చెబుతున్నా.. దమ్ముంటే సభకు రావాలి. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు మేం సమాధానం చెబుతాం. ఇది నా సవాల్`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీ పవిత్రమైన వేదిక. ఇక్కడ అడిగితే మేం సమాధానం చెబుతాం. వైసీపీ బట్ట కాల్చి ముఖాన వేసే పార్టీ. హిట్ అండ్ రన్ పార్టీ.. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. అందుకే రావట్లేదు. డీఎస్సీ అభ్యర్థులకు వారి కష్టంతో ఉద్యోగాలు వచ్చాయి. వారంతా ధైర్యంగా ఉండాలి. కుట్రలను ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది.`` అని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కూటమి విచ్ఛిన్నం కాదని. బలహీనం కాదని.. విశ్వసనీయతను కోల్పోదని చెప్పారు.