తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఆదివారం వరుసగా మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ములుగు సహా.. హనుమకొండ జిల్లాల్లో బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ జోరును మరింత పెంచారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ``వారిది ఫ్యామిలీ జస్టిస్ అయితే.. మాది సోషల్ జస్టిస్`` అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీని అర్థాన్నికూడా సీఎం వివరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తన కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే వారిది `కుటుంబ న్యాయం` అని దుయ్యబట్టారు.
కుటుంబానికి చేసుకున్న మేళ్లలో పావలా వంతు కూడా ప్రజలకు చేయలేదన్నారు. తద్వారా రాష్ట్రాన్ని అధోగతిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. ఇక, కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ప్రారంభమైరెండున్నరేళ్లు మాత్రమే గడిచిందని.. అయినా.. సామాజిక న్యాయం( సోషల్ జస్టిస్) చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్నట్టు వెల్లడించారు. అందుకే.. తమది సోషల్ జస్టిస్ పాలనగా మారిందన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నట్టుచెప్పారు
వెయ్యి మంది కేసీఆర్‌లు..
హనుమకొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరిగారు. వెయ్యిమంది కేసీఆర్‌లు ఏకమై వచ్చినా తనను ఏమీ చేయలేరు అని ఉద్ఘాటించారు. ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వమే మళ్లీ మళ్లీ వస్తుందన్నారు. సమాజంలో ఏ ఒక్కరినీ తాము విస్మరించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం వీధి నాటకాలు ఆడిందని దుయ్యబట్టారు. అయితే.. ఆ సమయంలో నిరుద్యోగులు బలంగా నిలబడి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.
రక్తాన్ని అమ్ముకున్నారు!
ఇటీవల బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ``కార్యకర్తల నుంచి రక్తదానం పేరుతో రక్తాన్ని తీసుకున్నారు. వారి చేతిలో ఓ పండు పెట్టారు. కానీ, ఆ రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుని లక్షలు సంపాయించుకున్నారు. వీరు రక్తపిపాసులు`` అని దుయ్యబట్టారు. కేసీఆర్ వల్ల రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని రేవంత్ చెప్పారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే.. ఆయన కుటుంబం మరిన్ని ఆస్తులు పోగేసుకుంటుందని.. రేవంత్ ముఖ్యమంత్రి అయితే.. ప్రజలకు ఆస్తులు వస్తాయని వ్యాఖ్యానించారు.