తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించి ఓ వ్యక్తి తన చెల్లి ని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమేశాడు``అని పరోక్షంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. అక్కడితో కూడా ఆగకుండా.. కేసీఆర్‌ను కూడా దులిపేశారు. ``ఇంటి పెద్దగా వ్యవహరించి.. సమస్యను పరిష్కరించా ల్సిన ఓ తండ్రి.. తన బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి తరిమేస్తే.. చేతులు ముడుచుకుని ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. `` అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంపై ఎప్పుడూ లేని విధంగా రేవంత్ విమర్శలు చేయడం గమనార్హం.
తాజాగా ములుగు జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. బీఆర్ ఎస్ హయాంలో ఈ వన దేవతల ఆలయాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా చేయలేదని దుయ్యబట్టారు. తాము త్వరలోనే ఈ గద్దె లను అభివృద్ది చేసి.. ప్రఖ్యాత ఆలయంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి మాట్లాడు తూ.,. ``ఒక రక్తం పంచుకుని మేం పుట్టలేదు. కానీ.. సీతక్కను మా ఇంటి ఆడబిడ్డకన్నాఎక్కువగా చూసుకుంటున్నాం. కానీ, `ఒకరు` తన చెల్లిని ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి తరిమేశాడు. దీనిని సరిచేయాల్సిన ఆ ఇంటి పెద్ద.. ఫామ్ హౌస్‌లో సేద దీరుతున్నాడు`` అని కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.
వారు శనీశ్వర్వులు
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి కేటీఆర్‌లను సీఎం రేవంత్ రెడ్డి శనీశ్వరులతో పోల్చారు. కుటుంబంలోని ఆడబిడ్డను తరిమేసిన వారు.. రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వారు ఈ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని మళ్లీ మళ్లీ లేవకుండా.. మీరు చూసుకోవాలి.. అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఆయన `అఘోరారావు`
ఇక, బీఆర్ ఎస్ మరో నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుపైనా సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. ``ఆయన హరీష్‌రావు కాదు.. అఘోరారావు. రాష్ట్రం నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటరా? కానీ, ఆయన కోరుకుంటడు. అందుకే.. క్షుద్ర పూజలు చేస్తున్నాడు అఘోరారావు. రాష్ట్రంలో చుక్క నీళ్లు కూడా ఉండకూడదని.. బొట్టు వర్షం కూడా రాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కానీ, దేవుడు చల్లగ చూస్తున్నాడు. అందుకే దండిగా వర్షాలుకురుస్తున్నాయి. ఈ అఘోరారావు చేసిన క్షుద్ర పూజలు ఎవరికోసమో అర్థం చేసుకోవాలి.`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.