కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా బ్రిటన్ పర్యనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన.. మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తనకు అమెరికా పర్యటన విషయంలో కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది రాష్ట్రాలపై చూపుతున్న వివక్షేనని పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ బూచిని చూపించడం దారుణమన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి కూడా విరుద్ధమని పేర్కొన్నారు. ఇలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి సైతం అమెరికాలో పర్యటిస్తున్నారని రేవంత్ తెలిపారు. రోజులు వారాల తరబడి అమెరికాలోనే తిష్ఠ వేస్తూ.. పెట్టబడులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. అలాంటి రైజింగ్ తెలంగాణ కోసం తాము పేట్టుబడులు ఆకర్షించడంలో తప్పే ముందని ప్రశ్నించారు. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం గానే చూస్తున్నామన్నారు. తన విదేశీ పర్యటనల విషయంలో కేంద్రం వివక్షను ప్రదర్శించడం దారుణమన్నారు. అయినా.. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలో విదేశాంగ ప్రతినిధులు తమ వెంటే ఉంటున్నారని.. ఏం జరిగినా వారు పర్యవేక్షిస్తారని తెలిపారు.
తాను తెలంగాణ సీఎంనని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి.. కేంద్రం మాత్రం తనను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చూస్తోందని విమర్శిం చారు. గుజరాత్‌కు పెట్టుబడులు రావాలి కానీ, తెలంగాణకు అవసరం లేదా? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితే కేంద్రం పెద్దలు ఎందు కు ఓర్చుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన తన ఆలోచనలను , రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. రైజింగ్ తెలంగాణ అనేది ఆగబోదన్నారు. డిసెంబరులో హైదరాబాద్‌లో భారీ సదస్సును నిర్వహించి.. పెట్టుబడులను ఆకర్షించనున్నట్టు తెలిపారు. తనను అడ్డుకున్న విషయాన్ని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కూడా ఖండిస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని వ్యాఖ్యానించారు.
గుజరాత్ ఆధిపత్యమా?
``మాపై గుజరాత్ ఆధిపత్యమా?`` అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 4 కోట్ల మంది ప్రజల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంగా పేర్కొన్నారు. గుజరాతీల ఆధిపత్యాన్ని సహించేది లేదన్నారు. ప్రధాని మోడీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చనని, అక్కడి అధ్యక్షుడి తల్లి పాదాలకు నమస్కారం చేయొచ్చని, అక్కడి బిర్యానీ తిని రావొచ్చని.. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం అమెరికా వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అబివృద్ధి కోసం చేసే ఏ పనినైనా ముందుకు తీసుకువెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి అంటనేది ఈ చర్యలతో స్పష్టమైందన్నారు. దీనిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.