వారసుడి ఎంట్రీ.. శ్రీకాకుళంలో ధర్మాన శకం ముగిసినట్లేనా.?

admin
Published by Admin — August 29, 2026 in Politics, Andhra
News Image

శ్రీకాకుళం(Srikakulam) రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి చక్రం తిప్పుతూ వస్తున్న సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రూటు మారుస్తున్నారా? వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారా..? అంటే అవున‌న్న స‌మాధానాలే వినిపిస్తున్నాయి. అయిదు దశాబ్దాల పాటు తనదైన వ్యూహాలతో తిరుగులేని నేతగా నిలిచిన ఆయన, ఇకపై ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడానికి బదులుగా తన వారసుడిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు పావులు కదుపుతున్నారు. గడచిన ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురుకావడం, వయసురీత్యా వస్తున్న పరిమితుల నేపథ్యంలో ఆయన తనయుడు రామ్ మనోహర్ నాయుడిని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasad Rao) రాజకీయ ప్రయాణం సర్పంచ్ స్థాయి నుంచి మొదలై మంత్రి పదవుల వరకు ఎదిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఇష్టం లేకుండానే అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ అసంతృప్తితో కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు పూర్తిగా వ్యూహాత్మక మౌనాన్ని వీడుతున్నారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా రామ్ మనోహర్ నాయుడు చేతికి అప్పగించినట్లు సమాచారం.

ఇప్పటికే నియోజకవర్గంలో యంగ్ లీడర్‌గా రామ్ మనోహర్ నాయుడు యాక్టివ్ అవుతూ క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. శ్రీకాకుళంలో ఇప్పటికీ ఉన్న ధర్మాన కుటుంబంపై అభిమానాన్ని, పార్టీ కేడర్ నిబద్ధతను నమ్ముకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ నెల చివరి నాటికి జరగనున్న నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత రామ్ మనోహర్ నాయుడు మరింత దూకుడుగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మొత్తానికి, శ్రీకాకుళం రాజకీయాల్లో ఒక బలమైన శకం ముగింపు దశకు చేరుకుంటూనే, మరో కొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. ధర్మాన ప్రసాదరావు రాజకీయ చాణక్యతను అందిపుచ్చుకుని ఆయన తనయుడు ఏ మేరకు రాణిస్తారు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP)ని ఏ విధంగా విజయతీరాలకు చేరుస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags
Srikakulam Politics Dharmana Prasad Rao Andhra Pradesh AP Politics YSRCP Dharmana Ram Manohar Naidu
Recent Comments
Leave a Comment

Related News