ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. సంక్షేమం ఒకవైపు, సంస్కరణలు మరోవైపు పరుగులు పెడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ప్రజల నాడి ఎలా ఉందనే దానిపై తాజాగా 'ఇండియా టుడే- సీ ఓటర్' మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ గెలుపు రుచి చూస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ తాజా సర్వే అంచనాల ప్రకారం, రాష్ట్రంలో కూటమి జోరు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 25 స్థానాల్లో అధికారిక కూటమికి దాదాపు 20 సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇందులో టీడీపీ(TDP), జనసేన పార్టీలు కలిసి 18 నుంచి 19 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉండగా, బీజేపీ ఖాతాలో 1 నుంచి 3 సీట్లు చేరవచ్చని అంచనాేశారు.
ఇక గతంలో ఇదే సర్వే సంస్థ వెల్లడించిన అంచనాలతో పోలిస్తే కూటమికి సీట్లు కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తోంది. గత జనవరిలో జరిగిన సర్వేలో కూటమికి ఏకంగా 24 సీట్లు దాకా వస్తాయని అంచనా వేయగా, తాజా నివేదికలో అది 20కి పరిమితమైంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ(YSRCP)కి ఈ సర్వేలో ఊరట లభించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పోలిస్తే, ప్రస్తుత ప్రజాభిప్రాయంలో వచ్చిన ఈ హెచ్చుతగ్గులు రాబోయే రాజకీయ పరిణామాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.