వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకుపై కోడలు మేఘన చేసిన సంచలన ఆరోపణలు షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. తన కోడలి మతం మార్చాలని ఒక మాజీ మంత్రి కోడలు ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయం అని చంద్రబాబు అన్నారు. ఆ మత మార్పిడిని గట్టిగా నిలదీసిన కోడలు మత మార్పిడికి నిరాకరించి బయటికి వచ్చేశారని, ఆ మహిళ చెప్పిన వైనం తనను బాధించిందని అన్నారు.
వైసీపీ హయాంలో బయట హిందువులుగా చలామణి అవుతూ చాలా మంది ఇళ్లలో ఇటువంటి పనులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది చాలా తప్పు అని ఖండించారు. విశ్వాసం వ్యక్తిగతమైన విషయమని, ఇతరులపై బలవంతంగా రుద్దడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఏపీలోని పలు దేవాలయాలపై దాడులు జరిగాయని, వైసీపీలో ఉండటానికి మతమార్పిడి కనీస అర్హతగా మార్చే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఈ రకంగా బలవంతపు మతమార్పిడులకు పాల్పడిన పార్టీకి ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు.