అమరావతిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ

admin
Published by Admin — August 29, 2026 in Politics
News Image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రీడారంగంలో ఏపీని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’తో పాటు 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభ సందర్భంగా రవీంద్ర పలు విషయాలు వెల్లడించారు.

క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించేందుకు పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ ల అకాడమీలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు 6 ప్రత్యేక అకాడమీలను ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలో ప్రతి క్రీడా పోటీలలో ఏపీ నుంచి కనీసం ఒక్కరైనా ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొని రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ‘హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్’గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు విజన్ అని చెప్పారు.

50 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికలో భాగంగా వైజాగ్, అమరావతి, తిరుపతిగా 3 జోన్లుగా విభజించామని మంత్రి రాం ప్రసాద్ తెలిపారు. నెల్లూరులో 1000 ఎకరాల్లో ‘స్పోర్ట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నామన్నారు. మంత్రి లోకేశ్ సూచనలతో జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానాలను అభివృద్ధి చేసి గ్రామీణ యువతకు క్రీడా సదుపాయాలు మరింత మెరుగుపరుస్తున్నామన్నారు.

Tags
amaravati sports city 2500 acres
Recent Comments
Leave a Comment

Related News