రాజకీయాల్లో ఎత్తుగడలు ఎంత వేగంగా మారుతాయో, బంధాలు అంతకంటే వేగంగా బెడిసికొడుతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ కనిపించిన కొండంత బలగం, పీఠం దిగిపోయాక ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకోవడం ఏ రాజకీయ నేతనైనా తీవ్రమైన ఆత్మవిమర్శలో పడేస్తుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒంటరి చేస్తోంది. నాడు జగన్‌ను గద్దె ఎక్కించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన సొంత కుటుంబ సభ్యులే, నేడు ఆయనకు రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తులుగా మారుతుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భారీ పతనానికి, అంతర్గత కుమ్ములాటలకు కారణం ఎవరి వ్యూహాత్మక లోపమో పరిశీలిస్తే విస్మయకరమైన విషయాలు బయటపడుతాయి.
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) అకాల మరణం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్షరాలా కవచంలా నిలిచారు. జగన్ జైలులో ఉన్న 16 నెలల సుదీర్ఘ చీకటి రోజుల్లో 'ఒక్క ఛాన్స్ అంటూ' రాష్ట్రమంతా తిరిగిన తల్లి త్యాగం, అన్న కోసం వదిలిన బాణంలా పాదయాత్రలు చేసి జనాలను కదిలించిన షర్మిల కష్టం సాధారణమైనది కాదు. ఆ ఇద్దరి మహిళల పోరాట పటిమే పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. కానీ, కల నెరవేరిన మరుక్షణమే ఆ రక్తసంబంధాలు ఒక్కసారిగా బీటలు వారాయి. రాజకీయ ప్రాధాన్యతలు, వ్యక్తిగత ఆధిపత్య ధోరణుల కారణంగా తల్లి, చెల్లి ఇద్దరూ జగన్‌కు దూరమయ్యారు. నేడు ఏకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి జగన్‌ను రాజకీయంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుండటం గమనార్హం.
కుటుంబ కలహాల పరంపర అక్కడితో ఆగలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య ఉదంతం వైఎస్ కుటుంబంలోనే కాక, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద భూకంపమే సృష్టించింది. గుండెపోటు నుంచి గొడ్డలి వేటు దాకా సాగిన ఈ రక్తచరిత్ర ఆరోపణలు జగన్ నైతికతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు ఎన్నికల రణరంగంలో జగన్‌కు పెద్ద ఆయుధంగా ఉన్న వివేకా కుమార్తె సునీతారెడ్డి(Sunitha Reddy), నేడు అదే జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయనను నైతికంగా నిరాయుధుడిని చేస్తున్నారు. నిందితులను కాపాడుతున్నారనే విమర్శలు వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. సొంత కుటుంబం నుంచి మొదలైన ఈ వ్యతిరేకత పార్టీని మూలాల నుంచి కదిలించివేసింది.
కేవలం సొంత కుటుంబమే కాకుండా, పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేశారనుకున్న నమ్మిన బంటులు కూడా ఒక్కొక్కరుగా జగన్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం. జగన్‌కు నీడలా ఉన్న వైవిఎస్ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జగన్ కోసం కేసులను ఎదుర్కొని A-2 గా జైలుకెళ్లిన సాయిరెడ్డి, ఇప్పుడు జగన్‌నే టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారు. అలాగే రాజధాని అమరావతిపై దూకుడుగా వ్యవహరించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పార్టీ ఆత్మీయుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్లు సైతం పార్టీని వీడారు. నాడు పార్టీకి వెన్నెముకగా ఉన్న వారంతా నేడు దూరమవ్వడం వెనుక కేవలం ప్రత్యర్థుల కుట్రలే ఉన్నాయా, లేక జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తే, ఇదంతా కేవలం బాహ్య శక్తుల ప్రభావం కాదనేది స్పష్టమవుతోంది. జగన్(Jagan) చుట్టూ ఏర్పడిన ఒక వర్గం కోటరీ, ఆత్మీయులను, సీనియర్లను క్రమంగా దూరం చేస్తూ ఒంటరి చేసిందనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. అయితే, సమర్థులైన నాయకులను దగ్గరగా ఉంచుకోవడంలో, అభిప్రాయభేదాలను సమన్వయం చేయడంలో నాయకత్వ స్థానంలో ఉన్న జగన్ స్వయంగా చేసిన తప్పిదాలే ఈ ఘోర వైఫల్యానికి దారితీశాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ నాడు కొండంత అండగా ఉన్న బలాలన్నీ నేడు రాజకీయ బలహీనతలుగా మారడానికి జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు.