ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ప్రమాణస్వీకరం చేసి నేటికి సరిగ్గా ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1995 సెప్టెంబర్ 1న `` చంద్రబాబు అనే నేను.. `` అంటూ ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణం చేశారు. అలా మొదలైన ఆ ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి రాజకీయ విజయమే కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోను, ఆ తర్వాత నవ్యాంధ్ర రాజకీయాల్లోనూ ఒక సుదీర్ఘ శకానికి నాంది పలికింది.దశాబ్దాలుగా ఎటుచూసినా ఎదురుదెబ్బలు, విజయాల కలయికగా సాగిన ఆయన పొలిటికల్ జర్నీని ఒకసారి పరిశీలిస్తే..
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాసింది. అయితే 1994-95 మధ్య కాలంలో పార్టీలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఎన్టీఆర్(NTR) లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం, ఆమె క్రమంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం పెంచుకోవడం సీనియర్ నాయకులకు రుచించలేదు. పార్టీ నిర్ణయాల్లో లక్ష్మీపార్వతి పాత్ర పెరగడం, సంప్రదాయ నాయకత్వాన్ని పక్కనపెట్టే ధోరణి పార్టీలో అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో, అల్లుడైన చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని సాధించేందుకు 1995 ఆగస్టు చివరి వారంలో పార్టీ శాసనసభ్యులను కూడగట్టడం మొదలుపెట్టారు. తక్కువ రోజుల వ్యవధిలోనే అనూహ్యమైన రీతిలో వ్యూహాలు రచించి, సీనియర్ నాయకులను తన వైపు తిప్పుకున్నారు. దాదాపు 160 మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టి, పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌పైనే అవిశ్వాసం ప్రకటించారు.
ఇక నాటకీయ పరిణామాల అనంతరం, 1995 సెప్టెంబరు 1న నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విద్యార్థి దశ నుంచే ముఖ్యమంత్రి కావాలన్న కల కన్న చంద్రబాబుకు, 23 నిరీక్షణ తర్వాత ఆ కల నిజమైంది. అయితే పార్టీ వ్యవస్థాపకుడిపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన నేతగా చంద్రబాబుపై మొదట్లో ఎన్నో సందేహాలు, మరెన్నో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రజా మద్దతు, పార్టీ విశ్వసనీయత చూరగొనడం చంద్రబాబు ముందున్న అతి పెద్ద సవాలుగా నిలిచింది. ఈ సవాలును అధిగమించేందుకు చంద్రబాబు వేగంగా పరిపాలనా సంస్కరణల బాట పట్టారు. ముఖ్యమంత్రి అయిన కేవలం రెండు నెలల్లోనే, 1995 నవంబరు 1న "ప్రజల వద్దకు పాలన" కార్యక్రమాన్ని ప్రారంభించారు. దశాబ్దాలుగా కార్యాలయాలకే పరిమితమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం ద్వారా పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకురావాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది ఆనాటి పరిపాలనా సంస్కృతికి భిన్నమైన ఆలోచనగా ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత 1997 జనవరి 1న "జన్మభూమి" కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఆర్థిక అసమానతలు లేని అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా గ్రామస్థాయిలో ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టడం దీని ఉద్దేశం. ఇదే కాలంలో ఐటీ రంగంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు, హైదరాబాద్(Hyderabad)ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలకు బీజం పడింది. ఇక రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా, చంద్రబాబు జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ (యునైటెడ్ ఫ్రంట్) ఏర్పడినప్పుడు దాని చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 1996 జూన్‌లో హెచ్‌డీ దేవెగౌడను ప్రధానమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాలు చంద్రబాబును జాతీయ స్థాయి వ్యూహకర్తగా, కింగ్‌మేకర్ గా నిలబెట్టాయి.
విజయాలు, ఎదురుదెబ్బలు
1999 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(TDP) ఘన విజయం సాధించి, చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణలో ఆయన శైలికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు అందని వర్గాల అసంతృప్తి ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు జూన్ 8, 2014న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019లో ఓటమి చవిచూసినా, 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.