విజయనగరం(Vizianagaram) జిల్లాకు చెందిన జడ్పీచైర్మన్, తాజా మాజీ జిల్లా వైసీపీ అధ్యక్షులు, భీమిలి వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. యువ నాయకుడు, బలమైన తూర్పు కాపు సామాజిక వర్గం యువతను ప్రభావితం చేయగలరని భావిస్తున్న మజ్జి ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఆయన వైసీపీకి రిజైన్ చేయడం.. ఆ వెంటనే టీడీపీకి అనుకూలంగా మారడం గమనార్హం. రాజకీయాల్లో ఎవరూ శాస్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి.. మచ్చి శ్రీను ఉరఫ్.. చిన్న శ్రీను విషయంలోనూ అలానే భావించాలి.
విజయనగరంలో తన మేనమామ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వద్ద 20 ఏళ్ల నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకుని బొత్స తర్వాత బొత్స అంతటి వాడిగా ఎదిగిన.. మజ్జి శ్రీనివాసరావు.. ఇప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తారన్నది చూడాలి. ముఖ్యంగా చీపురుపల్లి, బొబ్బిలి..విజయనగరం, నెల్లిమర్ల వంటి కీలక నియోజకవర్గాల్లో ఒకప్పుడు బొత్స తరఫున ఆయనే రాజకీయాలు చేశారు. మంత్రిగా బొత్స బిజీగా ఉన్న సమయంలో రాజకీయంగా ఇక్కడ చక్రం తిప్పారు. దీంతో రాజకీయంగా జిల్లాపై ఆధిపత్యం కూడా సంపాదించారన్న పేరుంది.
ఇక, ఇప్పుడు కారణాలు ఏవైనా.. చిన్నశ్రీను(Chinna Srinu) రాజకీయంగా టీడీపీలోకి చేరడంతో వ్యూహాత్మకంగా ఇక్కడ పవనాలు మారనున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట. బొత్సకు వయసు మీదపడడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఆయన హవా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు ఇప్పుడు చిన్నశ్రీనుకు జై కొట్టే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. మరోవైపు.. బొత్స కుమార్తె అనూషను రంగంలోకి దింపినా.. శ్రీను తన కుమార్తె సిరమ్మ ( సిరి సహస్ర)ను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని భావిస్తోన్న నేపథ్యంలో బొత్స కుమార్తె అనూష ఏమేరకు రాజకీయంగా సక్సెస్ అవుతారన్నది చూడాలి.
ఇక, స్థానికంగా టీడీపీ(TDP) అన్ని నియోజకవర్గాల్లోనూ బలంగానే కనిపిస్తోంది. మాజీ మంత్రి కళా వెంకట్రావు.. ప్రస్తుత గోవా గవర్నర్.. పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంటి యువ నేతలతో పాటు.. మరింత మంది నాయకులు పుంజుకున్నారు. ఇప్పుడు వీరికి మజ్జి శ్రీను మంత్రాంగం కూడా తోడు కావడం.. వైసీపీలో బొత్స ప్రభావం తగ్గుతుండడంతో విజయనగరం రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారనుందని తెలుస్తోంది. ఇది కూటమికి.. ముఖ్యంగా టీడీపీకి మేలు చేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.