శ్రీకాకుళం వైసీపీలో ముసలం పుట్టింది. సొంత పార్టీ నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోవడంతోపాటు.. రోడ్డు కెక్కారు. ``ఇప్పటికిప్పుడు కాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు. కావాలంటే రాసి పెట్టుకోండి.`` అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవినాగ్.. వచ్చే ఎన్నికల్లోపోటీ చేసేందుకు సిద్ధమైన తమ్మి నేని చిరంజీవి నాగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు.. పార్టీ నాశనం అయిపోతున్నా.. అధిష్టానం కళ్లు తెరవడం లేదని నేరుగా జగన్‌పైనే ఆయన బాణం సంధించారు.
ఏం జరిగింది?
ఇటీవల తమ్మినేని కుటుంబంపై భూముల కబ్జా కేసు నమోదైంది. ఈ కేసులో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి... ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. కానీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని తనయుడు చిరం జీవి నాగ్‌కు బెయిల్ రాలేదు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపారు. తర్వాత.. కొన్నాళ్లకు బెయిల్ వచ్చింది. ఇదిలావుంటే.. జగన్ శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో ఓ మహిళా ఎస్సైపై వైసీపీ నాయ కులు దురుసుగా వ్యవహరించారు. ఈ కేసులో.. వైసీపీ నేత చింతాడ రవి సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశా రు.
ఇటీవల.. పార్టీ తరఫున నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ``తమ్మినేని కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. కానీ, ఏమీ చేయని చింతాడ రవిని అరెస్టు చేశారు.`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమ్మినేని ఫ్యామిలీని కుదిపేశాయి. తమకు పార్టీ అండగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో కీలక నాయకులు ఇలా వ్యాఖ్యానించడం ఏంటన్నది ప్రశ్న. ఇక, ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన ఖండించలేదు.
తమ్మినేని రుసరుస..
తమ కుటుంబం అరెస్టు విషయంలో వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తమ్మినేని చిరంజీవి తీవ్రంగా తప్పుబ ట్టారు. వైసీపీ నాశనం అవుతోందన్నారు. ధర్మాన కృష్ణదాస్ వయసు పెరిగిందని.. బుద్ది మాత్రం పెరగలేదని వ్యాఖ్యానించారు. ధర్మాన ప్రసాదరావు కేసులకు భయపడుతున్నారని అన్నారు. పరిస్థితి ఇలానే.. ఉంటే పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని.. ఇప్పుడు కాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా శ్రీకాకుళంలో వైసీపీ నాశనం అయిపోతుందని తీవ్ర విమర్శలుగుప్పించడం గమనార్హం. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని కూడా.. తనయుడు చేసిన వ్యాఖ్యలపై మౌనం వహించారు. అంటే.. ఆయన కూడా అంగీకరించినట్టేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు.