టీడీపీని ఇరుకున పెడుతున్న జనసేన.. ప‌వ‌న్ ప్లానేనా..?

admin
Published by Admin — September 15, 2026 in Politics, Andhra
News Image

ఏపీ(AP) రాజకీయాల్లో కూటమి ధర్మంపై ఎప్పుడూ లేని చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వంలో కలిసి నడుస్తున్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయం కనిపిస్తున్నప్పటికీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి క్షేత్రస్థాయిలో మాత్రం సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాట్లు చేసుకుని త్యాగాలు చేసిన జనసేనాని, ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. బలమున్న ప్రతిచోటా గట్టి పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

అయితే, కేవలం బలం నిరూపించుకోవడమే కాకుండా, మిత్రపక్షం టీడీపీ(TDP)ని కార్నర్ చేసేలా జనసేన అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో అంతర్గత వేడిని ఒక్కసారిగా రాజేశాయి. మరోవైపు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక టీడీపీ నేతలపై చేసిన బహిరంగ విమర్శలు కూడా ఈ కోవకే చెందుతాయి. ఇలాంటి కీలక సమయంలో ఆయా నేతల నుంచి వస్తున్న విమర్శలను జనసేన అధిష్టానం కనీసం ఖండించకపోవడం, పైగా వాటిని సీరియస్‌గా తీసుకోకపోవడం గమనించదగ్గ విషయం. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, హైకమాండ్ ఆమోదంతోనే జరుగుతున్న వ్యూహాత్మక ఒత్తిడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడమే ఈ వ్యూహంలో అసలు మర్మమని తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల బలానికి తగినట్లుగా స్థానిక పీఠాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాలతో పాటు విజయవాడ(Vijayawada), గుంటూరు, ఏలూరు, ఒంగోలు, మచిలీపట్నం లాంటి కీలకమైన కార్పొరేషన్లలో సింహభాగం తమకే కేటాయించాలని పట్టుబడుతున్న ఇన్‌సైడ్‌ టాక్‌. మొత్తం ఉన్న 17 కార్పొరేషన్లలో దాదాపు సగం స్థానాలపై జనసేన కర్చీఫ్ వేయాలని చూస్తున్నట్లు సమాచారం.

పెద్ద పార్టీ అయిన టీడీపీతో నేరుగా సీట్ల సర్దుబాటు సమయంలో తక్కువకు రాజీ పడితే, గత అనుభవాలరీత్యా కేవలం రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందనే ముందస్తు అప్రమత్తతతోనే జనసేన(Janasena)  ఈ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే భారీ డిమాండ్లు తెరపైకి తెచ్చి, చర్చల దశలో పట్టు సాధించాలనేది ఆ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. మరి ఈ ఒత్తిడి రాజకీయాలకు టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? కూటమిలో ఈ గుసగుసలు మున్సిపల్ పోరు నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags
JanaSena TDP AP Politics Pawan Kalyan Andhra Pradesh Local Body Elections Nara Lokesh AP News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News