రాజకీయ నేతలు బహిరంగ సభలలో ప్రసంగించడానికి ముందు వారి అభిమానులు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కేకలు వేయడం, నినాదాలు చేయడం సర్వసాధారణం. అదే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల పాల్గొన్న మదనపల్లె సభలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు, పవన్ కోసం వారి అభిమానులు కేకలు వేస్తూ సభలో ఉత్సాహంగా కనిపించారు. అయితే, నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తున్న సందర్భంగా వారు ఇలా చేయడంతో స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకొని వారిని ఆపాల్సి వచ్చింది. వాస్తవంగా జరిగిన విషయం ఇది.
కానీ, తమకు ఉద్యోగాలు ఇవ్వండి... అంటూ సభలో యువత... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ముందు నినాదాలు చేస్తూ వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించిన వైనం షాకింగ్ మారింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను ఆధారం చేసుకుని ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
దీంతో జై రాం రమేష్ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఖండించారు. జైరాం రమేష్ ఇలా తొందరపడతారని అనుకోలేదని, ఇది నమ్మలేకపోతున్నానని నిర్మల సీతారామన్ అన్నారు. చంద్రబాబు, పవన్ లతో మాట్లాడేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారని, అందుకే తన కార్యక్రమం తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు సర్ది చెప్పారని అన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో పెట్టిన తప్పుడు పోస్ట్ ఆధారంగా వ్యాఖ్యలు చేయడం తగదని జై రాం రమేష్ కు సీఎం చంద్రబాబు హితవు పలికారు. సభలో కనిపించింది ప్రజాగ్రహం కాదని, నాయకుల పట్ల ప్రజలకు, కార్యకర్తలకు ఉండే అభిమానం.. ఉత్సాహం రూపంలో కనిపించిందని చెప్పారు.