ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం(Vizianagaram) జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచి, జిల్లాలో చక్రం తిప్పిన కీలక నేత చిన్న శ్రీనుకు త్వరలోనే టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
గత నెలలో అధికారికంగా టీడీపీ(TDP) కండువా కప్పుకున్న చిన్న శ్రీను, అప్పట్నుంచీ పార్టీ అధినాయకత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మంగళగిరిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లను వరుసగా కలిసిన ఆయన, జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన అనుభవం, గ్రౌండ్ లెవల్లో ఉన్న పట్టును గుర్తించిన హైకమాండ్, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందే ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. అయితే, పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లడానికి, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కొనేందుకు బలమైన నాయకత్వం అవసరమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే చిన్న శ్రీను వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన వెంటనే జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరినీ స్వయంగా కలుసుకుని సమన్వయంతో ముందుకు వెళ్తామని చిన్న శ్రీను(Chinna Srinu) భరోసా ఇవ్వడం మరొక విశేషం.
చిన్న శ్రీను రాకతో విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఆయన వెంటే నడిచిన మెజారిటీ వర్గం, అనుచరులు ఇప్పుడు టీడీపీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ(YSRCP)కి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణులను ఏకం చేసి, 2029 నాటికి జిల్లాలో టీడీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చిన్న శ్రీను అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా, ఒకనాటి ప్రత్యర్థి పార్టీ బడా నేత ఇప్పుడు స్వపక్షంలో కీలక పదవి చేపట్టనుండటం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.