ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే వేరు. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన ఈ మలయాళ బ్యూటీ.. సినిమా ఓకే చేసేటపుడే ప్రమోషన్లకు రానని తేల్చి చెప్పేయడం అలవాటు చేసుకుంది. పారితోషకం ఎంతిచ్చినా సరే.. ప్రమోషన్లలో మాత్రం ఆమె కనిపించదు. హీరోయినే సినిమాను ప్రమోట్ చేయకుంటే ఎలా అని ఎవరైనా ప్రశ్నించినా.. నేను ఆ పని చేయనని ముందే చెప్పా కదా అని ఆమె ఎదురు ప్రశ్నిస్తుంది. చాలామంది నిర్మాతలు నయనతార తీరును తప్పుబట్టినా.. ఆమె మాత్రం మారలేదు. కానీ ఒకప్పటి బాయ్ ఫ్రెండ్, తర్వాత తన భర్తగా మారిన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేసిన రెండు సినిమాలను మాత్రం నయన్ ప్రమోట్ చేసింది. విఘ్నేష్ సినిమాలను ఒకలా.. మిగతా చిత్రాలను ట్రీట్ చేయడమేంటి అని మీడియా వాళ్లు నయన్ తీరును ఎండగట్టినా ఆమెలో చలనం లేకపోయింది. ఐతే ఇప్పుడు నయన్ తాను పెట్టుకున్న రూల్‌ను తీసి పక్కన పెట్టేసి, ఒక బయటి సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సీనియర్ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో నయన్ ఓ సినిమా చేస్తోంది. గతంలో ఆర్జే బాలాజి దర్శకత్వంలో నయన్ ప్రధాన పాత్ర పోషించిన ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానిిక ఇది సీక్వెల్. ఆర్జే బాలాజీ ప్రస్తుతం సూర్య హీరోగా రాబోతున్న సినిమా మీద పని చేస్తుండగా.. ‘మూకుత్తి అమ్మన్’ సీక్వెల్ బాధ్యతలను సుందర్ తీసుకున్నారు.
ఇటీవలే ఆయన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘మదగజరాజా’తో హిట్ కొట్టారు. ఆ ఉత్సాహంలో కేవలం నెల రోజుల్లోనే ‘మూకుత్తి అమ్మన్-2’ స్క్రిప్టు రెడీ చేసేశారట. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నయన్ హాజరై చాలా ఉత్సాహంగా కనిపించింది. ఆమె పూజా వేడుకలో పాల్గొన్న వీడియోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈమె నయనతారేనా? సినిమా షూటింగ్‌లో తప్ప మిగతా ఏ కార్యక్రమంలో పాల్గొనని నయన్.. ఇప్పుడు ఒట్టు తీసి గట్టున పెట్టేసిందా అని సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. మరి నయన్ ఈ సినిమా వరకే ఇలా మినహాయింపు ఇచ్చిందా.. లేక ఇక ముందు తాను నటించే ప్రతి సినిమాకూ ఇలాగే చేయబోతుందా అన్నది ఆసక్తికరం.