జగన్ కు వైయస్ విజయమ్మ షాక్

admin
Published by Admin — February 28, 2025 in Politics, Andhra
News Image

అనూహ్య రీతిలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల పంచాయితీ కోర్టు ముంగిటకు చేరుకోవటం తెలిసిందే. ఆస్తుల కంటే కూడా బంధాలకు.. అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఆయనకు మాత్రమే చెల్లు. డబ్బుల్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. తన దగ్గర ఉన్న డబ్బుల్నిఅవసరాల కోసం వాడేందుకు వెనుకాడేవారు కాదు. అదే సమయంలో తనను నమ్ముకున్న వారి కోసం వెచ్చించేందుకు సంశయించేవారు కాదు.


అంతేనా.. ఇంట్లోని బంగారాన్నితనఖా పెట్టి మరీ రాజకీయ ఖర్చుల కోసం వినియోగించేవారు. అప్పులు ఆయన్ను భయపెట్టేవి కావు. ఆ మాటకు వస్తే.. తనను నమ్ముకున్న వారికి ఏదోలా సాయం చేయాలన్న తపన తప్పించి.. కుప్పలు తెప్పులుగా ఆస్తులు పోగేయాలన్న తలంపు ఆయనలో పెద్దగా కనిపించేది కాదు. మొత్తంగా సంపద కోసం ఆయన తహతహలాడేవారు కాదని మాత్రమే చెప్పటం ఇక్కడి ఉద్దేశం.


అలాంటి కుటుంబంలో ఆస్తుల కోసం కోర్టు వరకు రావటం చూసినప్పుడు కాలానికి మించిన విలన్ ఇంకెవరు ఉండరన్న భావన కలుగుతుంది. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపు విషయంలో వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సతీమణి భారతితో పాటు ఆయన తల్లి విజయమ్మ.. సోదరి షర్మిల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం కేసును క్లుప్తంగా ఒకట్రెండు లైన్లలో చెప్పాల్సి వస్తే.. ‘‘సరస్వతి పవర్ కార్పొరేషన్ లో అనుమతి లేకుండా జరిగిన వాటాల బదలాయింపును నిలిపేయాలి. వాటాదారుల రిజిస్టర్ లో పేర్లను మార్చి మా వాటాను పునరుద్ధరించాలి’’ అని కోరుతూ జగన్.. భారతిరెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వివాదానికి సంబంధించి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు విజయమ్మ తాజాగా తన వాదనను వినిపించారు. ఇందులో భాగంగా కోర్టుకు తన వాంగ్మూలాన్ని పత్రాల రూపంలో సమర్పించారు. వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్.. భారతిలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించొద్దన్న ఆమె.. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. ట్రైబ్యులన్ కు దాఖలు చేసిన కౌంటర్ లో విజయమ్మ పేర్కొన్న అంశాల్ని క్లుప్తంగా చూస్తే..
– సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారు. ట్రైబ్యునల్ ను జగన్.. భారతిరెడ్డిలు తప్పుదోవ పట్టిస్తున్నారు. సరస్వతి లిమిటెడ్ తో కానీ.. గిఫ్ట్ డీడ్ తో కానీ షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు. జగన్ కు.. షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడకు తీసుకురావటం ట్రైబ్యునల్ ను తప్పుదోవ పట్టించటానికే.


– సరస్వతి వాటాలపై సర్వహక్కులు నావే. వారిద్దరి ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా నిస్సహాయంగా న్యాయస్థానంలో నిలబడాల్సి వచ్చింది. నన్ను ఇంత ఆవేదనకు గురి చేయటం జగన్.. భారతిలకు సరికాదు.
– సరస్వతి వాటాల కొనుగోలు.. గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారంనా పేరు మీద బదలాయించారని.. షర్మిల ఫ్యూచర్ ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ ను ఆమెపై విశ్వాసంతో చేసి ఇచ్చామని పేర్కొనటం అవాస్తవం.

– ప్రస్తుతం సరస్వతిలో జగన్.. భారతిలకు వాటాలు ఏమీ లేవు. ఇందులో 99.75 శాతం వాటాలు నావే. కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్.. భారతిరెడ్డి.. క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావు. వాటిని భారీ జరిమానా వేసి కొట్టేయాలి.
– జగన్ కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాలతోనే పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 59ను తప్పుగా అన్వయిస్తున్నారు. జగన్ కు.. షర్మిలకు విభేదాలు ఉన్నా ఈ కంపెనీ పిటిషన్ కు దాంతో సంబంధం లేదు. చట్టప్రకారం కార్పొరేట్.. వాటాదారుల హక్కులకు సంబంధించిన సెక్షన్ 59ను వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదు.

– సరస్వతిలోని 46.71 లక్షల వాటాలను సండూర్ కంపెనీ.. 71.50 లక్షల వాటాలను క్లాసిక్ రియాల్టీ నాకు అమ్మింది. దీంతో మొత్తం 1.21 కోట్ల ఈక్విటీ వాటాలతో 48.99 శాతం దక్కించున్నాను. 2021 జులై 26న జగన్.. భారతిలు రెండు గిఫ్ట్ డీడ్ నాకు ఇచ్చారు. ఈ డీడ్ ప్రకారం సరస్వతిలో జగన్ కు చెందిన 74.26లక్షల వాటాలు.. భారతికి చెందిన 40.50 లక్షల వాటాలను నాకు బదిలీ చేశారు. వీటికి సంబంధించిన వివరాల్ని కౌంటర్ లో ప్రస్తావిస్తున్నాను.


– 2021 జులై 23న క్లాసిక్ రియాల్టీ నాతో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ.. సరస్వతి పవర్.. నేను మాత్రమే పార్టీలుగా ఉంటాం. సరస్వతి పవర్ లోని 11.37 లక్షల వాటాలను రూ.3.07 కోట్లకు క్లాసిక్ రియాల్టీ నాకు బదిలీ చేసింది.
– వాటాలను నా పేరుతో బదలాయించాలంటూ గత ఏడాది జూన్ పద్నాలుగున సరస్వతి కంపెనీకి రాసిన లేఖలోనూ ఈ విషయాల్ని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి నాకు వాటాల్నిబదలాయించారు. గత ఏడాది జులై 2న బోర్డు సమావేశంలో ఉంచాం. డైరెక్టర్లు బదలాయింపునకు ఆమోదం తెలిపారు. దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో నా పేరు నమోదైంది.

– ఇప్పుడు వాటాల బదలాయింపు.. నా హక్కుల గురించి ప్రశ్నించటానికి కారణాలు లేవు. ఇప్పుడు కంపెనీలో నాకు 99.75 శాతం వాటా ఉంది. చట్టబద్ధంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేయటం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయటమే.
– వ్యక్తిగత..రాజకీయ వివాదాలను కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగటం చట్టవిరుద్ధం. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. జగన్.. భారతిలకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరు మీద బదిలీ అయ్యాయి. ఈ కారణంగా సరస్వతిలో వారికి ఎలాంటి వాటాలు లేవు. ఈ కారణంతోనే ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదు.

– జగన్ కు.. షర్మిలకు సంబంధించిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్ కు సంబంధం లేదు. వారిద్దరి మధ్య విభేదాలు నా హక్కులపై ప్రభావం చూపవు. షర్మిల ప్రయోజనాల కోసం వాటాలను ఆమె వద్ద ఉంచానని జగన్ చెప్పటం అవాస్తవం. గిఫ్ట్ డీడ్ లో షర్మిల ప్రయోజనాల కోసం ఎలాంటి షరతులు లేవు. అవాస్తవాలతో ట్రైబ్యునల్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

– ఆస్తుల కేసుల్లో వాటాలపై యథాతథస్థితి ఉందని జగన్ చెబుతున్నారు. అది అవాస్తవం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో గుంటూరులోని సరస్వతి ఆస్తుల జప్తు జరిగింది. అంతేకానీ వాటాలను ఈడీ జప్తు చేయలేదు. జగన్ చెబుతున్నట్లుగా యథాతథ స్థితి ఉత్తర్వులు ఉంటే నాకు గిఫ్ట్ డీడ్ ఎలా చేసి ఇస్తారు. వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారు? అప్పుడు లేని కోర్టు ఉత్తర్వులను ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి వాటాల బదలాయింపును రద్దు చేయాలని కోరటం సరికాదు. అంతేకాదు వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్.. భారతిలు దాఖలు చేసిన పిటిషన్ సైతం విచారణకు అర్హత లేదు. అందుకే ఈ పిటిషన్ ను కొట్టేసి…. జరిమానా విధించాలి.

Tags
court ex cm jagan Saraswari cements lands
Recent Comments
Leave a Comment

Related News