టాలీవుడ్ నిర్మాత మరణం మిస్టరీనే..

admin
Published by Admin — February 28, 2025 in Movies
News Image

రెండు రోజుల కిందట టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ శెలగంశెట్టి హఠాత్తుగా మరణించడం పెద్ద షాక్. కొన్నేళ్ల కిందట సుకుమార్, విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన నిర్మాత అతను. అతనీ చిత్రంతోనే నిర్మాతగా అరంగేట్రం చేయాల్సింది. అల్లు అర్జున్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన కేదార్.. ప్రొడ్యూసర్‌గా గ్రాండ్ ఎంట్రీకి బాగానే ప్లాన్ చేసుకున్నాడు కానీ.. ఆ ప్రాజెక్టు ఏవో కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. తర్వాత అతను విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పెట్టి ‘గం గం గణేశ’ అన సినిమా తీశాడు. అది డిజాస్టర్ అయింది. తర్వాత ఏ సినిమాను మొదలుపెట్టలేదు., మధ్యలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు తన మరణం గురించి వార్త బయటికి వచ్చింది. దుబాయ్‌లో కేదార్ చనిపోయినట్లు సమాచారం తెలిసింది కానీ.. మరణానికి కారణమేంటన్నది ఎవ్వరూ చెప్పలేదు. రెండు రోజులు గడిచాక కూడా దీని గురించి ఏ సమాచారం లేదు.

కేదార్ మరణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వెర్షన్ ఏంటంటే.. కేదార్ కొన్ని కార్యక్రమాలు, పార్టీల్లో బిజీగా ఉండి దుబాయ్‌లో మూడు రోజుల పాటు నిద్రే పోలేదని.. దీంతో గుండె మీద ఒత్తిడి పడి అతను హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడని అంటున్నారు. దుబాయ్‌లో గత శనివారం సుకుమార్ సహా పలువురు సెలబ్రెటీలు ఒక హై ప్రొఫైల్ మ్యారేజ్‌లో పాల్గొన్నారు. తర్వాతి రోజు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.

ఆ మరుసటి రోజు ‘పుష్ప-2’ సక్సెస్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూడింట్లో కేదార్ కీలకంగా ఉన్నాడు. కొన్ని కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. పార్టీల్లో పాల్గొన్నాడు. దీంతో నిద్ర లేక, తీవ్ర అలసటకు గురై గుండెపోటుకు గురయ్యాడని అంటున్నారు. ఇంకోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో కేదార్ మరణం వెనుక కుట్రకోణం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే కేసులో నిందితుడైన కేపీ చౌదరి అనే మరో నిర్మాత ఇటీవల గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన విషక్ష్ం తెలిసిందే. ఇదే విషయమై ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విలేకరులు ప్రస్తావిస్తే.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ మరణాలపై విచారణ జరుపుతామని పేర్కొనడం గమనార్హం.

Tags
Kedar Selagamsetty DeathLatest news
Recent Comments
Leave a Comment

Related News