కోడి కత్తి డ్రామా, వివేకా హత్య కేసు ఇలా మాజీ సీఎం జగన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని టిడిపి నేతలు పలు మార్లు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామా జగన్ నటనకు పరాకాష్ట అని సోషల్ మీడియాలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. అయితే, కోడి కత్తి డ్రామా వల్ల 2019 ఎన్నికలకు ముందు జగన్ ఎంతో కొంత లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవమే.
ఈ క్రమంలోనే టిడిపి శ్రేణులకు చంద్రబాబు తాజాగా కీలక సూచన చేశారు.
జగన్ తో జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి డ్రామాలను పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని టిడిపి నేతలకు చంద్రబాబు తాజాగా సూచించారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన టిడిఎల్పి సమావేశంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేక హత్య కేసు, కోడి కత్తి డ్రామా వంటి అంశాలను జగన్ టిడిపిఈపై నెట్టేందుకు జగన్ ప్రయత్నించాడని, ఆప్పట్లో తగినంత ఆప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోవాల్సి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా జగన్ కుట్రలను పసిగట్ట లేకపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ ప్రమాద ఘటనలోనూ కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రమాద ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ కోరినప్పటికీ ఇవ్వలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక ఈ బడ్జెట్ ను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదేనని చంద్రబాబు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మంచి సమన్వయం ఉండాలని, విభేదాలకు తావు లేకుండా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితులను గ్రూప్ రాజకీయాలను సహించబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరు ప్రకారమే రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని చంద్రబాబు కరాఖండిగా చెప్పేశారు.