ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. సీఎం చంద్రబాబు టీడీపీ శాసన సభా పక్ష ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. మొత్తం 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు(చంద్రబాబుతో సహా) ఈ సమావేశానికిహాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు కీలక విషయాలను ప్రస్తావించారు. 1) మాజీ సీఎం జగన్ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2) టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపు రాజకీయాలు చేయడం.
ఈ రెండు అంశాలపైనా చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. సుమారు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఇతర విషయాలు ప్రస్తావించినా.. జగన్ కుట్రల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. కొన్ని రోజుల కిందట.. జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి వద్ద.. మంటలు రాజుకున్నాయి. తాడేపల్లి ఇంటి ప్రహరీని ఆనుకుని.. బయట మంటలు రాజుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. గతంలో కోడి కత్తి దాడి, వివేకానందరెడ్డి దారుణ హత్యలను ఆయన వివరించారు. అప్పట్లో టీడీపీకికానీ.. పార్టీ నాయకులకు కానీ.. ఈ రెండు అంశాలతో సంబంధం లేదన్నారు.
అయినా..జగన్ ఆయన పార్టీ నాయకులు కోడికత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు చేసి, ప్రజల్లోకి వెళ్లి యాగీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు. టీడీపీ నే అధికారంలో ఉందని.. అయినా మనం ఆ రెండు అంశాల విషయంలో బలమైన పోరాటం చేయలేకపోయామన్నారు. ఇప్పుడు తాడేపల్లి మంటల విషయంలోనూ టీడీపీపై విమర్శలు చేసే అవకాశం ఉందని.. కాబట్టి నాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విమర్శ వచ్చినా.. బలంగా తిప్పికొ ట్టాలని టీడీఎల్పీలో స్పష్టం చేశారు. ఈ విషయంలో తన దాకా విషయం వచ్చేలోగానే స్పందించాలని తేల్చి చెప్పారు.
గ్రూపులపై..
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిపై తనకుచాలా జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు అందరినీ కలుపుకొనిపోయిన నాయకులు ఇప్పుడు గెలిచిన తర్వాత.. గ్రూపులకు దిగడం సరికాదన్నారు. పార్టీ తరఫున ప్రజల వద్దకు వెళ్లాలని ఎన్ని సార్లు చెప్పినా.. ఎవరూ వినిపించుకో వడం లేదన్నారు. “ఎంపీ అంటే.. ఎమ్మెల్యేకి పడదు, ఎమ్మెల్యే అంటే ఎంపీకి పడదు. ఇలా అయితే.. మీరే నష్టపోతారు“ అని చంద్రబాబు సూటిగా వ్యాఖ్యానించారు. సమన్వయంతో పనిచేసుకోవాలని ఎన్ని సార్లు చెప్పించుకుంటారని ఆయన నిలదీశారు.
అంతేకాదు.. “ఎన్నికల్లో గెలిచాం కదా.. మాకేమీ కాదని మీరు అనుకుంటున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో సీటు రావాలంటే.. ఇప్పుడు చేసే పనిని ప్రామాణికంగా తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో టికెట్ వద్దులే అనుకునేవారు మీ ఇష్టం. కావాలని అనుకుంటే.. సమన్వయంతో పనిచేయాలి“ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక, ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశామన్న సీఎం.. ఈ విషయాలను మార్చి 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ విషయంలో రాజీ ధోరణి వద్దని ఆయన సూచించారు. “పేపర్లలో చదువుకుంటారులే, టీవీల్లో చూస్తారులే.. అనే ఉదాసీనత వద్దు. మీరు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి బడ్జెట్ లో ఎవరెవరికి ఏమేం కేటాయించామో వివరించండి“ అని చెప్పారు.