నందమూరి వారసుడి ఎంట్రీ అంటేనే టాలీవుడ్‌లో ఒకేలాంటి అంచనాలు ఉంటాయి. కుటుంబం నుంచి వస్తున్న మాస్ లెగసీని కంటిన్యూ చేయడం, రొటీన్ కమర్షియల్ ఫార్ములాతో బాక్సాఫీస్ బరిలోకి దిగడం సాధారణంగా జరిగే తంతు. కానీ, నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) తేజ లాంచ్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ట్రెండ్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, తొలి సినిమాతోనే రూల్స్ మార్చే సాహసం చేస్తున్నారనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
డైరెక్టర్ వశిష్ఠ(Director Vassishta) తెరకెక్కిస్తున్న ఈ డెబ్యూ మూవీని కేవలం ఒక లాంచ్‌లా కాకుండా, సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. ఇందులో పునర్జన్మలు, విభిన్న టైమ్‌లైన్స్ వంటి సంక్లిష్టమైన అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి హీరోలంటే వెంటనే గుర్తుకొచ్చే మాస్ ఇమేజ్ జోలికి వెళ్లకుండా, మొదటి చిత్రంతోనే మోక్షజ్ఞకు ఒక యూనిక్ బ్రాండ్‌ను క్రియెట్ చేయాలని పక్కా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను కేవలం కథతోనే కాకుండా ఒక డీప్ మిస్టరీతో ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సినిమా ప్రపంచం ఎలాంటిది, హీరో పాత్ర ఏంటి, గతాన్ని వర్తమానం ఎలా కలుపుతోంది లాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తోనే ప్రమోషన్ వ్యూహం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ట్రెడిషనల్ రూల్స్‌ని పక్కన పెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును వెతుక్కుంటూ మోక్షజ్ఞ వేస్తున్న ఈ అడుగు టాలీవుడ్(Tollywood)లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.