``ఆటలో గాయాలు శరీరానికే.. వైసీపీ చేస్తున్న గాయాలు మనసుకు తగులుతున్నాయ్!``- అని ఏపీ(AP)లో 2025లో నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ అంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు.. చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు.. సభ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచిసాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు హాజరయ్యారు. తమ నియామక ప్రక్రియపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాన్ని ఖండించారు.
నాడు కష్టపడ్డాం..
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందామని వైసీపీ(YCP)కి చులకనగా ఉందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. అయితే.. తాము గతంలో ఎంతో కష్టపడ్డామని నిద్రాహారాలు మాని.. స్పోర్ట్స్ లో పాల్గొన్నామని చెప్పారు. ఈ క్రమంలో చేతులకు, కాళ్లకు, నడుము వంటి కీలక భాగాలకు గాయాలు కూడా అయ్యాయని కొందరు మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. నాడు అనేక కష్టాలు పడింది.. రాష్ట్రం కోసమేనని తెలిపారు. ఇప్పుడు ఆ కోటాలో ఉద్యోగాలను పొందామన్నారు. కానీ,తమనుచులకనగా చూస్తూ.. స్పోర్ట్స్ కోటా అంటే.. అదేదో మోసపూరిత మన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాడు క్రీడల్లో తగిలిన దెబ్బలకంటే కూడా.. ప్రస్తుతం వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతోనే తమకు ఎక్కువగా దెబ్బలు తగులుతున్నాయన్నారు.
సామర్థ్యమనే పరమావధి..
సామర్థ్యమే పరమావధి అయినప్పుడు.. ఒకే కుటుంబంలో రెండు ఉద్యోగాలు లభిస్తే.. తప్పేంటని కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయి. వీటిపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది మోసపూరిత డీఎస్సీగా అభివర్ణించారు. ఈనేపథ్యంలో ఆ ఉపాధ్యాయులు కూడా విజయవాడ సమావేశానికి వచ్చారు. తమకు సామ ర్థ్యం ఉందని.. దాని ఆధారంగానే తమకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. ఇది తప్పా? అని ప్రశ్నించారు. గతంలో క్రీడల్లో మెడల్స్ సాధించినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా(Roja) సన్మానాలు, సర్టిఫికేట్లు అందుకున్నామన్నాన్నరు. ఈ సందర్భంగా వారు నాటి ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు.
తగ్గని వైసీపీ..
మరోవైపు సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి నిరసనకు రెడీ అయ్యారు. డీఎస్సీ-2025(DSC-2025) లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. సోమవారం విజయవాడలో వైసీపీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. మంగళవారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు. అయితే.. వైసీపీ పిలుపునిచ్చిన ధర్నాలకు.. నిరసనలకు పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. విజయవాడలో అయితే.. ముందస్తు అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ.. తాము నిరసనల నుంచి వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలు ప్రకటించడం గమనార్హం.