వెండితెరపై ఎన్నో ప్రేమకథల్లో నటించి ప్రేక్షకులను అలరించిన చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) రియల్ లైఫ్ లవ్ స్టోరీ మాత్రం సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా సాగింది. పైకి ఎంతో సాఫీగా కనిపించే కాజల్, గౌతమ్ కిచ్లుల ప్రయాణం వెనుక ఊహించని మలుపులు, బ్రేక్‌అప్‌లు, ఆ తర్వాత మళ్లీ కలయిక వంటి ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న అనుబంధం గురించిన ఆసక్తికర విషయాలను పంచుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా సెలబ్రిటీల ప్రేమకథలు షూటింగ్ సెట్లలోనో, పార్టీలలోనో పుడుతుంటాయి. కానీ కాజల్, గౌతమ్(Gautam Kitchlu)ల పరిచయం మాత్రం చాలా సాధారణంగా ఒక స్నేహితుడి పెళ్లి వేడుకలో ప్రారంభమైంది. అలా పరిచయమైన వీరు కాలక్రమేణా మంచి స్నేహితులుగా, ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. దాదాపు పదమూడేళ్లపాటు ఈ ప్రయాణం సాగింది. అయితే ప్రయాణం సాగుతున్నంత సేపు అన్నీ సజావుగా సాగలేదు. కొన్ని వ్యక్తిగత సమస్యలు, మనస్పర్థల కారణంగా వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఒకరినొకరు విడిపోయిన తర్వాత ఈ జంట ఎవరి దారి వారు చూసుకున్నారు. జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా వేర్వేరు వ్యక్తులతో డేటింగ్‌కు కూడా వెళ్లారు. కానీ ఈ గ్యాప్ వారి మధ్య దూరాన్ని పెంచలేదు సరిగ్రా.. ఒకరి జీవితంలో మరొకరి ప్రాముఖ్యత ఏంటో స్పష్టంగా తెలియజేసింది. ఇతరులతో డేటింగ్ చేసిన అనుభవమే తమ అసలు బంధాన్ని మరింత బలంగా మార్చిందని కాజల్ స్వయంగా వెల్లడించడం విశేషం. విడిపోయి చూస్తేనే కానీ భాగస్వామి విలువ ఏమిటో అర్థం కాలేదని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎవరి దారుల్లో వారు కొంతకాలం ప్రయాణించినప్పటికీ, విధి వీరిని మళ్లీ ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. పునఃకలయిక తర్వాత కాజల్(Kajal) చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు. గౌతమ్ ముందు ఒక కఠినమైన షరతు పెట్టారు. "ఈసారి మనం కచ్చితంగా పెళ్లి చేసుకుందాం, లేదా జీవితాంతం ఒకరికొకరు దూరంగా గుడ్‌బై చెప్పుకుందాం" అంటూ తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అదృష్టవశాత్తూ గౌతమ్ ఆలోచనలు కూడా సరిగ్గా అలాగే ఉండటంతో, ఇక ఆలస్యం చేయకుండా వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2020 అక్టోబర్ 20న ముంబై వేదికగా కోవిడ్-19(Covid-19) నిబంధనల మధ్య ఈ జంట ఒక్కటైంది. ఎన్నో ఒడుదొడుకులను, పరీక్షలను దాటుకుని పెళ్లిపీటలెక్కిన ఈ దంపతులకు 2022లో పండంటి మగబిడ్డ ‘నీల్’ జన్మించాడు. ప్రస్తుతం తమ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్న కాజల్-గౌతమ్ లవ్ స్టోరీ.. విడిపోయినంత మాత్రానా నిజమైన ప్రేమ చావదని, మనససులు కలిస్తే ఎప్పటికీ ఏదో ఒకరోజు తిరిగి కలుస్తారని నిరూపించేలా ఉంది.