అది నిమ్స్ మెడికల్ కళాశాల. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రతిష్ఠలు సొంతం చేసుకున్న వైద్యశాల కూడా!. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి.. కేవలం తెలంగాణ నుంచే కాకుండా.. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు క్యూకడతారు. ఇక్కడ వైద్యులు ఎంతో నమ్మకంగా.. విశ్వాసంగా సేవలు అందిస్తారన్న పేరుంది. ఒకప్పుడు నిజాంల పాలనలో ఉన్న ఈ వైద్య శాల.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. ఇంత గౌరవ ప్రతిష్ఠలను సొంతం చేసుకున్న ఈ ఆసుపత్రిపై ఏ నాడూ మరకలు పడలేదు. మచ్చలు కూడా రాలేదు. అలాంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న నోరి లక్ష్మీ భాస్కర్.. ఇప్పుడు అక్రమాల పుట్టగా మారిపోయారు.
తవ్వోకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో అలెర్ట్ అయిన ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేయడం.. గత రెండు రోజులుగా తనిఖీలు చేయడం తెలిసిందే. ఈ క్రమంంలో వెలుగు చూసిన ఆస్తుల చిట్టా అధికారులను కూడా మతిపోయేలా చేసింది.వైద్యో నారాయణో హరి.. అన్న సూక్తి కాస్తా.. వైద్యో సంపాదనో హరి.. అన్నట్టుగా మార్చేయడం అధికార వర్గాలను కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 ఫ్లాట్లు.. అవి కూడా అత్యంత ఖరీదైన కూకట్ పల్లి ప్రాంతంలోనే 2, మణికొండలో మూడు .. ఇతర ప్రాంతాల్లో 2 ఉండడం అధికారులను విస్మయానికి గురి చేసింది. వీటితో పాటు అరకిలో బంగారం.. కేజీల కొద్దీ వెండి సామగ్రిని అధికారులు గుర్తించారు. ఇక, తెలంగాణలోనే కాకుండా.. ఏపీ సహా కర్ణాటకలోనూ ఆయన ఆస్తులు కూడగట్టారని అధికారులు గుర్తించారు.
అత్యంత ఖరీదైన విశాఖలోని ఓ ప్రాంతంలో 800 గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. అలానే బ్యాంకుల్లో దాస్తే.. లెక్కలు చెప్పాలని అనుకున్నారో ఏమో.. లక్ష్మీ భాస్కర్.. పోస్టాఫీ సులోనే 12 లక్షల రూపాయల మేరకు కూడబెట్టారు. ఇతర బ్యాంకుల్లో 41 లక్షలు ఉన్నాయి. కానీ.. వాటిని కూడా అధికారులు గుర్తించారు. ఇలా.. లక్ష్మీ భాస్కర్ కూడబెట్టిన అక్రమ సంపాదన వివరాలు వెల్లడయ్యే సరికి.. తోటి వైద్యులు.. నిమ్స్ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నుంచి ఇంత సొమ్ము వచ్చింది? ఎలా సంపాయించారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా.. బ్యాంకు లాకర్లను ఇంకా తెవరలేదని అధికారులు వెల్లడించారు. ఇవి తెరిస్తే.. మరింత సంపాదన బయట పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఎంతెంత.. ఇదీ అవినీతి చిట్టా..
+ కూకట్‌పల్లిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు
+ మణికొండ, పేట్ బషీర్బాద్ 5 ఫ్లాట్లు
+ యాదాద్రి, నందిగామ, శామీర్పేటలలో 4 ఓపెన్ ప్లాట్లు
+ విశాఖపట్నంలో 800 గజాల స్థలం
+ బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షల నగదు.
+ పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.12 లక్షల నగదు.
+ ఇతర బ్యాంకుల్లో రూ.35 లక్షల మేర పెట్టుబడులు
+ 517 గ్రాముల బంగారం.
+ 3 విలాసవంతమైన కార్లు.