మినిస్ట‌ర్ గ్రాఫ్‌: నూజివీడులో కొలుసు ఎఫెక్ట్ ఎంత‌.. ?

admin
Published by Admin — September 28, 2026 in Politics, Andhra
News Image

మంత్రిగా ఓకే.. పాలిటిక్స్ ప‌రంగా జీరో..అనే టాక్‌... నూజివీడు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి కొలుసు పార్థ‌సార‌థి(Kolusu Partha Sarathy) విష‌యంలో గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఆయ‌న రెండున్న‌రేళ్ల కింద‌ట టీడీపీలో చేరినా.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు.. ఆయ‌న‌కు మ‌ధ్య లింకు ఇంకా బ‌ల‌ప‌డ‌లేద‌ని అంటున్నారు. కానీ.. ప‌నితీరు విష‌యంలో మాత్రం.. మెజారిటీ ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని చెబుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది.  ఇదే గ‌త ఎన్నిక‌ల్లో కొలుసు పార్థసారథి గెలుపున‌కు క‌లిసి వ‌చ్చింది. అయితే.. ఆయ‌న‌కు ఇప్పుడు కేడ‌ర్ దూర‌మ‌వుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మంత్రిగా బిజీగా ఉండ‌డ‌మో..లేక ఏం జ‌రుగుతోందో తెలియ‌దు కానీ.. క్యాడ‌ర్‌కు మాత్రం మంత్రి దూరంగానే ఉంటున్నారు.

ఇక‌, మంత్రి(Minister) పనితీరుపై నియోజకవర్గ స్థాయిలో సానుకూలమైన స్పందన కనిపిస్తోంది. స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండటం ద్వారా ఆయన నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.  నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో క్రమం తప్పకుండా ప్రజల ఫిర్యాదుల స్వీకరణ వంటివి నిర్వ‌హిస్తున్నారు.  సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ఇటీవలే నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలకు చెందిన పలువురు బాధితులకు లక్షలాది రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

అదేస‌మ‌యంలో అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు.  నూజివీడు(Nuzividu) పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, సిమెంట్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల పనులపై ఆయన స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నా రు. రైతులకు, గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. "మీ భూమి – మీ హక్కు" వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌బుక్కులను పంపిణీ చేయడంలో చొరవ చూపారు. గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ, రైతుల సమస్యలను నేరుగా పొలాల్లోకి వెళ్లి అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రిగా రాష్ట్రస్థాయి బాధ్యతలు చూసుకుంటూనే.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు.

స్థానికంపై ఎఫెక్ట్‌..!
అభివృద్ది ఎంత చేసినా.. కేడ‌ర్‌కు చేరువ‌గా ఉంటేనే నాయ‌కుల‌కు బ‌లం చేకూరుతుంద‌న్న విష‌యం కొలుసుకు తెలియంది కాదు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఆయ‌న‌.. కేడ‌ర్ విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. నిజానికి నూజివీడులో కూట‌మి పార్టీల్లో టీడీపీ ఒక్క‌టే బ‌లంగా ఉంది. సో.. కేడ‌ర్ త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొలుసు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. కానీ, ఆయ‌న శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌నిఅంటున్నారు. ఈ ఎఫెక్ట్‌.. నియోజకవర్గంలోని ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల్లో భారీగా క‌నిపిస్తోంది. దీంతో స్తానిక ఎన్నిక‌ల‌పై ఈ ప్ర‌భావం ప‌డుతుంద‌న్న చ‌ర్చ ఉంది. అయితే.. అంద‌రూ టీడీపీ(TDP)నే క‌దా.. అని మంత్రి అంటుండ‌గా.. మ‌రోవైపు వైసీపీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags
Kolusu Partha Sarathy Nuzividu AP Politics TDP Andhra Pradesh CM Chandrababu Naidu Minister Graph
Recent Comments
Leave a Comment

Related News