అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం రాజకీయాలు అధికార కూటమికి అనుకూలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న కుటుంబ రాజకీయాలు ఇక్కడి ఎమ్మెల్యే.. సీనియర్నేత బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana Murthy)కి కలిసి వస్తున్నాయన్న ప్రచారం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కీలకమైన ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మూర్తికి అనుకూలంగా మారాయని అంటున్నారు. వైసీపీ అభ్యర్థి ఈర్ల అనురాధపై 28,026 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన మూర్తి తన హవాను కొనసాగిస్తున్నారు.
మరోవైపు.. 2019లో ఇక్కడ నుంచి విజయం దక్కించుకుని మంత్రి కూడా అయిన బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఇక్కడి నుండి వరుసగా గెలిచిన మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు 2024 ఎన్నికల్లో తన కుమార్తె ఈర్ల అనురాధను వైసీపీ తరఫున బరిలోకి దించారు. అయితే, అదే సమయంలో ఆయన కుమారుడు బూడి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు బయటపడ్డాయి.
తనను గెలిపించకపోయినా ఫర్లేదని.. తన తండ్రి ముత్యాలనాయుడును మాత్రం ఓడించాలని రవి కుమార్ చేసిన ప్రచారం జోరుగా సాగింది. ఆ వివాదాలు ఇప్పటికీ సర్దుమణగలేదని అంటున్నారు. దీనికితోడు.. పార్టీలోనూ బూడి రాజకీయాలపై అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఇవి టీడీపీకి, ముఖ్యంగా మూర్తి రాజకీయాలకు కలిసి వస్తున్నాయి. అంతర్గత వివాదాల కారణంగా ఇటీవల వైసీపీ(YCP)కి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు. ఇక, బండారు ఎమ్మెల్యేగా బండారు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' వంటి కార్యక్రమాలను స్థానికంగా విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నియోజకవర్గంలో క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత జగన్(Jagan) కూడా మాడుగుల నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అవుతూ పార్టీని పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన రాజకీయ వ్యూహంతో కొనసాగుతుండగా, వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి, అంతర్గత నష్ట నివారణ చర్యలపై దృష్టి పెడుతోంది.