జనసేన(Janasena) సీనియర్‌నేత, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పనితీరుపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. 2024 జూన్‌లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన శాఖల అభివృద్ధికి ఆయన చురుగ్గా అడుగులు వేస్తున్నారు. అయితే.. సినీ రంగాన్ని ఆకర్షించే విషయంలో మాత్రం దుర్గేష్ కొంత మేరకు వెనుకబడ్డారన్న వాదన ఉంది. సినిమాటోగ్రఫీ, నంది అవార్డుల పునరుద్ధరణ వంటివి బాగానే ఉన్నా.. రాజకీయంగా సినీ రంగాన్ని యాక్టివ్ చేసే విషయంలో దుర్గేష్ ఆశించిన విధంగా పాలిటిక్స్ చేయలేక పోతున్నారు.
గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను డిసెంబర్ 2026 నాటికి ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) ఇటీవల కీలక ప్రకటన చేశారు. 2012 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు 2025 అవార్డులను కూడా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంలో ఆయన చొరవ చూపారు. తద్వారా సినీ రంగాన్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక, అత్యంత కీలకమైన సినిమా షూటింగ్‌ల పెంపు, థియేటర్ల సమస్యలు, జీఎస్టీ స్లాబుల మార్పులపై సినీ రంగం అసంతృప్తితోనే ఉందని వార్తలు వస్తున్నాయి.
పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని.. రాష్ట్రానికి ఆదాయం పెంచాలని చూస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచేలా చూస్తున్నారు. విశాఖ సమ్మిట్ ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, సుమారు 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు నాటకరంగం, జానపద కళల పునరుద్ధరణకు నాటక అకాడమీ ద్వారా నిధులు, వసతులు కల్పించేందుకు హామీ ఇచ్చారు.
నియోజకవర్గ రాజకీయం చూస్తే.. నిడదవోలు(Nidadavolu) అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల హైబ్రిడ్ యాన్యూటి మోడల్ పథకం ద్వారా పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడంలో భాగస్వాములయ్యారు. మంత్రి దుర్గేష్‌కు పనితీరు పరంగా సానుకూల ముద్ర ఉన్నప్పటికీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కేటాయింపులు, స్థానిక పైరవీల విషయంలో కొందరు స్థానిక జనసేన నేతల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే కూటమిలో సమన్వయం పెద్దగా చూపలేక పోతున్నారన్న వాదన కూడా ఉంది. మొత్తంగా ఆయన పనితీరు ఫిఫ్టీ.. పిఫ్టీ అన్నట్టుగానే ఉందని అంటున్నారు.