చిక్కుల్లో సాయిరెడ్డి కొత్త పార్టీ.!

admin
Published by Admin — November 12, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో వ్యూహకర్తగా, దశాబ్దాల అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్‌గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి తాజా రాజకీయం పెద్ద పరీక్షే పెడుతోంది. ఎంతో ఆర్భాటంగా, సరికొత్త నినాదాలతో ఆయన స్థాపించిన 'పరివర్తన రాజనీతి పార్టీ(Parivarthana Rajaneethi Party)' కొద్ది గంటల్లోనే అనూహ్య వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కేవలం ముహూర్తాలు, ఆర్భాటాల మీద పెట్టిన శ్రద్ధ.. కనీస సాంకేతిక అంశాలపై లేకపోవడమే ఇప్పుడు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది.

విజయవాడ వేదికగా నవంబర్ 11న ఆయన ప్రకటించిన పార్టీ పేరుతోనే, దేశ రాజధానిలో మరో రాజకీయ సంస్థ ముందే రిజిస్టర్ అయి ఉండటం  అసలు ట్విస్ట్. ఢిల్లీ(Delhi) కేంద్రంగా ముకేష్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న 'పరివర్తన రాజనీతి పార్టీ' ఇప్పటికే ఎన్నికల సంఘం రికార్డుల్లో అధికారికంగా ఉనికిలో ఉంది. అంతేకాదు, కేవలం కాగితాల మీద పేరుండటమే కాకుండా.. ఇటీవలి తమిళనాడు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేయడం, ఆ తర్వాత ఈసీకి వార్షిక నివేదికలు, ఐటీఆర్ పత్రాలు సమర్పించడం వంటి ఆధారాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈసీ నిబంధనల ప్రకారం ఒకే పేరుతో దేశంలో వేర్వేరు పార్టీలకు అనుమతి ఉండే ప్రసక్తే లేదు. ఒకవేళ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఆ పాత పార్టీని ఏమైనా విలీనం చేసుకున్నారా? లేక టేకోవర్ ప్రక్రియ పూర్తి చేశారా? అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇవేమీ తెలియకుండానే అనౌన్స్‌మెంట్ చేసేయడంతో.. నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు ఆయన అనుభవాన్ని ప్రశ్నిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. ఒక సీనియర్ మోస్ట్ లీడర్‌ నుంచి ఇలాంటి పొరపాటు జరగడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కొత్త రాజకీయ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించిన సాయిరెడ్డికి తొలి అడుగులోనే ఈ పేరు వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ టెక్నికల్ చిక్కుముడిని ఆయన ఏ విధంగా విప్పుతారు? లేక పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.

Tags
VijayaSai Reddy Parivarthana Rajaneethi Party PVP Ap Politics Andhra Pradesh Ap News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News