గ్రామాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. రూ.11,085 కోట్ల భారీ అంచనాలతో ఈ పథకం ప్రారంభమైంది. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులను సమగ్రంగా మెరుగుపరచనున్నారు. దాదాపు రూ.10,250 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,500 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నారు. రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వ పటిమను ఆయన కొనియాడారు. ఒక ఉద్యమ స్ఫూర్తితో పవన్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీ రాజ్ శాఖ పల్లెల ప్రగతిలో తనదైన ముద్ర వేసిందని ఆ శాఖా మంత్రి పవన్ ను అభినందించారు.
2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో పల్లెలు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయని, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేలేని దుస్థితి ఉందని విమర్శించారు. అటువంటి స్థితి నుంచి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని పవన్ ను ప్రశంసించారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దొంగల జేబుల్లోకి వెళ్లగా, నేడు అభివృద్ధి పనులు ప్రజల కళ్లకు కనిపిస్తున్నాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.