దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీయగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వందేళ్ల క్రితం సైమన్ కమిషన్‌ను రక్షించబోయి నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఎలా కుప్పకూలిపోయిందో.. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్‌కు కూడా అదే గతి పడుతుందని రేవంత్ రెడ్డి సంచలన జోస్యం చెప్పారు.
దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లను పద్దతి ప్రకారం తొలగిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు వెనక ఇలాంటి ఓట్ల తొలగింపు కుట్రలే ఉన్నాయని విపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కునే దెబ్బతీసేలా ఈ చర్యలు ఉన్నాయని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రేవంత్ తీవ్రంగా హెచ్చరించారు.
మరోవైపు సీఈసీ చర్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఉగ్రవాదులను బంధించినట్లుగా ప్రతిపక్ష నేతలను విసిరిపారేయడంపై విపక్ష శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ పరిణామంతో వెంటనే రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయణమయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి రాహుల్ గాంధీని పరామర్శించడానికి బారా ఖంబ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసుల హడావుడి మధ్య రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని బ్యాక్‌డోర్ నుంచి తరలించడంతో ఆయనను కలవడం సాధ్యపడలేదు.
రాహుల్ గాంధీ పోరాడుతుంటే ప్రభుత్వం ఆయనపై అణచివేత చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని రేవంత్(Revanth Reddy) దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేది లేదని, రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముంబైలో సీజెపీ సహా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, విపక్షాలు ఈ ఓట్ల తొలగింపు కుట్రపై రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఈసీకి అండగా నిలవడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.