నీతులు చెప్పే ట్రంప్.. రష్యాతో డీజిల్ డీల్

admin
Published by Admin — October 13, 2026 in International
News Image

చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉందన్న విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా మరోసారి సిగ్గు లేకుండా చెప్పేసింది. ప్రపంచ దేశాలు ఏవీ కూడా రష్యాతో ఆయిల్ ఒప్పందాలు చేసుకోకూడదని.. అలా చేసుకునే వారిపై ఆంక్షల పిడుగు వేస్తామని ఘీంకరించి.. అలానే చేసిన ట్రంప్.. చివరకు అదే రష్యాతో భారీ డీజిల్ డీల్ చేసుకున్న తీరు చూస్తే.. అగ్రరాజ్య అహంకారం ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తన దేశం.. తన దేశ ప్రయోజనాలు తప్పించి ఇంకేమీ పట్టనట్లుగా వ్యవహరించే అమెరికా.. అలాంటి తీరును ప్రపంచంలోని మరే దేశం ప్రదర్శించకూడదన్నట్లుగా వ్యవహరిస్తుంది.

రష్యా వద్ద ముడి చమురు కొనే భారతదేశం మీద అదే పనిగా ఆంక్షల కత్తిని దూసే ట్రంప్.. తాజాగా భారీ డీజిల్ ఒప్పందానని కుదుర్చుకున్న విషయాన్ని ఆయనే తన సొంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజా ఒప్పందం ప్రకారం రష్యా తక్షణం మూడు లక్షల టన్నుల డీజిల్ ను అమెరికా.. ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు అంగీకరించినట్లుగా వెల్లడించారు. నవంబరులో మరో 5 లక్షల టన్నులు.. ఆ తర్వాత మరో పది లక్షల టన్నుల చొప్పున డీజిల్ ను రష్యా విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు.

తాజా డీల్ కోసం అమెరికా ఆర్థిక శాఖ రష్యా డీజిల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను వచ్చే ఏడాది ఏప్రిల మొదటి వారం వరకు ఎత్తేసింది. ఇప్పటివరకు రష్యాపై కఠినమైన ఆంక్షల్ని విధించి.. ఇతరులు రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తే భారీ సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు తానే స్వయంగా రష్యాతో చేతులు కలపటం.. డీజిల్ డీల్ చేసుకోవటం చూస్తే.. అమెరికా విదేశాంగ విధానాలు ఎలా ఉంటాయన్నది అర్థమవుతుంది.

ట్రంప్ ఇలాంటి నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు. అమెరికాలో ఇప్పటికే డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం అక్కడి డీజిల్ ధరలు 70 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజా ఉద్రిక్తతలు.. పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రిఫైనరీల సామర్థ్యం తగ్గింది. దీంతో తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. డీజిల్ ధరలు పెరగటంతో దాని ప్రభావం నిత్యవసర వస్తువుల మీద పడింది. దీంతో ద్రవ్యోల్బణం ఎక్కువైంది. దీన్ని తక్షణం అదుపు చేయటానికి ట్రంప్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ గెలుపు మీద ప్రభావాన్ని చూపుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కారు తీరుపై గుర్రుగా ఉన్న అమెరికన్లు.. ఓటుతో తమ నిర్ణయాన్ని తెలిపే అవకాశాలు ఎక్కువ. ఇది రిపబ్లికన్ అభ్యర్థుల విజయవకాశాల మీద ప్రభావం చూపుతుంది.అందుకే.. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి.. ధరల అదుపునకు వీలుగా రష్యాతో డీజిల్ డీల్ చేసుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడితో సహా.. ఉక్రెయిన్ కు మిత్రపక్షంగా ఉండే దేశాలు తప్పుపడుతున్నాయి. అమెరికాలోనూ ట్రంప్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని పలువురు ప్రతిపక్ష నేతలు సైతం దెయ్యంతో ఒప్పందం చేసుకోవటమా? అంటూ ట్రంప్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా అమెరికా ప్రయోజనాలు.. తమ రాజకీయ లక్ష్యాలను చేరుకోవటం తప్పించి మరేమీ ట్రంప్ లాంటి అధినేతకు ముఖ్యం కాదన్న విషయం తాజా డీల్ స్పష్టం చేస్తుందని చెప్పాలి. 

Tags
Trump
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News