ఫ్యాన్సేమో అలా.. హీరోలేమో ఇలా

admin
Published by Admin — October 17, 2026 in Movies
News Image

ఇంత‌కుముందు సోష‌ల్ మీడియా ఫ్యాన్ వార్స్ పెద్ద పెద్ద హీరోల అభిమానుల మ‌ధ్యే ఉండేవి. కానీ ఈ మ‌ధ్య మిడ్ రేంజ్, చిన్న స్థాయి హీరోల అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటున్నారు. త‌మ హీరోకు, అత‌డి సినిమాకు ఎలివేష‌న్ ఇచ్చుకోవ‌డం కంటే.. అవ‌త‌లి హీరోను, త‌న సినిమాను కించ‌ప‌ర‌చ‌డ‌మే ఫ్యానిజంగా మారిపోయింది ఈ రోజుల్లో. ఒక‌ప్పుడు క‌లిసి స‌ఖ్య‌త‌తో ఉన్న అభిమాన వ‌ర్గాలు కూడా ఇప్పుడు ప‌ర‌స్ప‌రం దారుణ‌మైన పోస్టులు పెట్టుకుంటూ విషం కక్కుకుంటున్నారు. 

ఇలా బ‌ద్ధ శ‌త్రువుల్లా మారిపోయిన మిడ్ రేంజ్ హీరోల ఫ్యాన్ డ‌మ్స్ అంటే.. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌వే. నాని సినిమా ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతోనే విజ‌య్ పేరు సంపాదించాడు. ఐతే త‌ర్వాత ఒక ద‌శ‌లో నానిని మించి విజ‌య్ ఎదిగిపోవ‌డం.. ఆపై నాని డామినేట్ చేయ‌డంతో ఇద్ద‌రి అభిమానుల మ‌ధ్య క‌య్యానికి కార‌ణ‌మైంది. ఒక హీరో సినిమా వ‌చ్చిన‌పుడు ఇంకో హీరో ఫ్యాన్స్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. త‌ర్వాత అవ‌త‌లి వ‌ర్గం బ‌దులు తీర్చుకుంటోంది.

ఇటీవ‌ల ది ప్యార‌డైజ్ సినిమా వ‌చ్చిన‌పుడు విజ‌య్ ఫ్యాన్స్ దాన్ని టార్గెట్ చేశార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు విజ‌య్ మూవీ ర‌ణ‌బాలిని నాని అభిమానులు ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోల పోస్టులు, కామెంట్లు చూస్తే.. ఇంత వైరం, ద్వేషం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది అనే సందేహం క‌లుగుతుంది. ఐతే ఫ్యాన్స్ ఇలా గొడ‌వ‌ప‌డుతుంటే.. ఆ హీరోలు మాత్రం స‌ఖ్య‌త‌తో మెలుగుతున్నారు. తాజాగా నాని.. విజ‌య్ మూవీ ర‌ణ‌బాలి బాగా ఆడాల‌ని కోరుకుంటూ మంచి పోస్టు పెట్టాడు. అందులో విజ‌య్‌ని కొనియాడాడు. 

బ‌దులుగా విజ‌య్ కూడా అంతే ప్రేమ‌గా స్పందించాడు. నాని సినిమా బ్ల‌డీ రోమియోకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇలా హీరోలిద్ద‌రూ ఒక‌రి గురించి ఒక‌రు పాజిటివ్‌గా మాట్లాడుతూ.. వాళ్ల సినిమాల‌కు విషెస్ చెబుతుంటే, ఫ్యాన్స్ మాత్రం అంత ద్వేషంతో ర‌గిలిపోవ‌డం.. అవ‌త‌లి హీరోల సినిమాల‌ను టార్గెట్ చేయ‌డం ఏంటో అర్థం కావ‌ట్లేదు మ‌రి. ఐతే ఈ హీరోలిద్ద‌రూ పైకి క‌నిపించినంత మంచి ఫ్రెండ్సేమీ కాద‌ని.. తెర వెనుక ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌ని ప‌రిస్థితి ఉంద‌ని, వాళ్ల పీఆర్ టీంలు అవ‌త‌లి హీరోల సినిమాల‌ను టార్గెట్ చేయిస్తున్నాయ‌నే ఒక ప్ర‌చారం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags
Vijay Devarakonda and Nani fan war
Recent Comments
Leave a Comment

Related News