ఆర్నబ్ తుఫాను రూపంలో రాష్ట్రానికి ఆపద వచ్చిందని.. పలు జిల్లాలు వర్షాలు, తుఫాను గాలులతో అతలాకుత లం అవుతున్నాయని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీలోని పలు జిల్లాల్లో తుఫాను పరిస్థితులపై ఆయన చర్చించారు. అటు అధికారులు, ఇటు పార్టీ కీలక నాయకులతోనూ పవన్ కల్యాణ్ చర్చించారు. ఈ విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని.. సహాయక సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎదురైన సమస్యలు పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ సిబ్బంది నిరం తరం అందుబాటులో ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయా విభాగాల సిబ్బంది సెలవులు కూడా రద్దు చేశామని వివరించారు. అయితే... ఇది మాత్రమే సరిపోదన్న ఆయన.. ప్రజలను ఆదుకునేందుకు పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు సాయం చేయాలని కోరారు. ఆపద సమయంలో ఆదుకోవడమే జనసేన లక్ష్యమన్నారు.
``ఇది కష్టకాలం.. ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్పందించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. మీ సమీపంలోని ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయండి. పార్టీ పరంగా వారికి ఏం కావాలో అవన్నీ ఇవ్వండి`` అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిని పక్కన పెట్టాలని సూచించారు. అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి.. బాధితులకు రవాణా, సామగ్రి, ఆహారం, నీరు అందించే విషయంలో చొరవ చూపాలని సూచించారు. ఈ సమయంలో ఆదుకోవడమే అసలైన ప్రజా సేవగా ఆయన పేర్కొన్నారు.
తూర్పులో ప్రారంభం..
పవన్ కల్యాణ్ పిలుపు ఇవ్వగానే తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు జనసేన నాయకులు ప్రజలకు అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టారు. కొందరు గొడుగులు పంచిపెట్టగా.. మరికొందరు పులిహోర,తాగునీరు వంటి ఆహారా పదార్థాలను అందించారు. ఇంకొందరు వృద్ధులు, దివ్యాంగులను పునరావాస కేంద్రాలకు తరలించే క్రమంలో సాయం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలోనూ జనసేన నాయకులు సేవకు ముందుకు వచ్చారు. తద్వారా ఒకవైపు ప్రభుత్వ సిబ్బంది.. మరోవైపు జనసేన నాయకులు కూడా ప్రజలకు అండగా నిలిచారు.