సరిగ్గా మూడేళ్ల కిందట.. ఇదే రోజు .. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి వైసీపీ హయాంలో ఆయనను అరెస్టు చేసిన తీరు.. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన విధానం వంటివి ఆయన మననం చేసుకున్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట అక్టోబరు 31న సాయంత్రం.. తాను రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చానని.. కోట్లాది మంది ప్రజలు తనను బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం.. వారి ఆశలు ఫలించాయని బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. శనివారం రాత్రి చంద్రబాబు సుదీర్ఘ పోస్టును పెట్టారు.
``నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను`` అని సీఎం పేర్కొన్నారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేశారు. ``అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది.`` అని అన్నారు.
45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో 53 రోజుల జైలు జీవితం అత్యంత కఠినమైనదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున(అక్టోబరు 31) మళ్లీ ప్రజల్లోకి వచ్చానని గుర్తు చేశారు. ``నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
నాడు అసలు ఏం జరిగింది?
టీడీపీ అధినేత, అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9, 2023న ఏపీ సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2014-2019) రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు.. నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.3,281 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వం 10 శాతం (దాదాపు రూ. 371 కోట్లు) భరించాలని, మిగిలిన 90 శాతాన్ని సీమెన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో పెట్టుబడిగా పెట్టాలని ఒప్పందం కుదిరింది.
అయితే.. ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేసిన రూ. 371 కోట్ల ప్రభుత్వ నిధులు ఒప్పందం ప్రకారం ఖర్చు చేయకుండా, ఎటువంటి టెండర్లు లేకుండా షెల్ కంపెనీలకు మళ్లించారని సీఐడీ ఆరోపించింది. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆ డబ్బు డ్రా అయిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2017 లోనే పూణేకు చెందిన జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ విభాగం కొన్ని షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలను గుర్తించి విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి నిధుల అక్రమ మళ్లింపుపై దర్యాప్తు జరిపింది. ఈ క్రమంలో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా (A-1) పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి.. ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుంచి 53 రోజుల పాటు చంద్రబాబును రాజమండ్రి జైల్లో ఉంచారు.