ఏపీలో పలు జిల్లాల్లో సోమవారం రీపోలింగ్ జరిగింది. వాస్తవానికి ఆదివారం స్థానిక సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే.. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడం, మరికొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లను కొందరు చించేయడం, ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం, తిరుపతి, కడప, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని ఏడు మునిసిపల్ స్థానాలకు ఉన్న 12 వార్డులలో ఈ రీపోలింగ్ జరిగింది. వీటిలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ డిమాండ్ చేసిన పులివెందుల కూడా ఉండడం గమనార్హం.
12 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటు చేసుకోలేదని అధికారులు వెల్లడించారు. అయితే.. పోలిం గ్‌కు నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ.. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నికొన్ని బూతుల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ వేసేందుకు ఓటర్లు వచ్చారు. అయితే.. ఆదివారం నాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత పటిష్టమైన భద్రతను కల్పించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారినే బూతుల వద్ద అనుమతించారు.
జగన్ ఏడీ?
వైసీపీ అధినేత ఆదివారం తనసొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ సమయంలో తన పార్టీకి చెందిన 70 మంది ఏజెంట్లను ఎక్కడా అనుమతించలేదని ఆరోపించారు. దీంతో ఆయన రోడ్డెక్కి ధర్నా కూడా చేశారు. ఈ క్రమంలోనే పులివెందులలో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో తాను ఓటు వేసేది లేదన్నారు. రీపోలింగ్ నిర్వహిస్తే అప్పుడు వచ్చి ఓటు వేస్తానని చెప్పారు. కానీ, సోమవారం పులివెందుల సహా కడప జిల్లాలోని జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం వంటి కీలక ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగినా.. జగన్ జాడ కనిపించలేదు.
ప్రజాస్వామ్యంపై..
పులివెందులలోని 1, 3, 7, 8వ వార్డులకు సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. వీటిలో జగన్ ఓటు 7వ పోలింగ్ బూత్‌లో ఉందని అంటు న్నారు. అయినప్పటికీ.. ఆయన వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని.. ఓటు హక్కు అంటే విలువ లేదని అందుకే రీపోలింగ్ పెట్టినా ఆయన రాలేదని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. జగన్పూర్తిగా పులివెందులలోని అన్ని వార్డుల్లోనూ రీ పోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారని.. కానీ, ఎంపిక చేసిన వార్డుల్లోనే రీపోలింగ్ పెట్టారని.. అందుకే ఆయన దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.