రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఒక ఊపు ఊపేశాయి. పండుగ వాతావరణంలో అధికార కూటమి శ్రేణులు విజయయాత్రలు చేస్తున్నారు. జనసేన సైతం మరోసారి తన హవాను చాటుకుంటూ ప్రతిచోటా తిరుగులేని విజయాలతో దూసుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరు మున్సిపల్ పోరులోనూ స్పష్టంగా కనిపించింది. కానీ, ఒక్క ప్రాంతం మాత్రం పూర్తిగా విరుద్ధమైన చర్చకు కేంద్రబిందువైంది. అదే జనసేనాని ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram).
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ కూటమి జయకేతనంతో హోరెత్తుతుంటే, పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఊహించని రాజకీయ రంగులు మారాయి. మొత్తం 36 వార్డులున్న ఈ నియోజకవర్గంలో ముందే మూడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాల్లో జరిగిన పోరు విచిత్రమైన తీర్పును వెలువరించింది. ప్రధాన పార్టీలైన జనసేన, టీడీపీ(TDP), వైసీపీలు తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించినా, ఇక్కడ ఓటర్లు మాత్రం పార్టీల జెండాల కంటే రెబల్ అభ్యర్థులకే జై కొట్టారు. ఫలితంగా అధికార, ప్రతిపక్షాల లెక్కలన్నీ తలకిందులయ్యాయి.
ఇక్కడ అసలు అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రధాన పార్టీలన్నీ టికెట్లు నిరాకరించడంతో అసంతృప్తితో రగిలిపోయిన కొందరు నేతలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అధిష్టానాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. కానీ ఎవరికీ అందని విధంగా ఏకంగా 10 వార్డుల్లో ఈ రెబల్సే ఘన విజయం సాధించి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఏ పార్టీలో చూసినా ఇదే తంతు నడిచింది. జనసేన(Janasena) నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు, చివరకు ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నుంచి ఇద్దరు రెబల్స్ సైతం పక్కదారి పట్టి స్వతంత్రులుగా గెలుపొందడం విశేషం.
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా రెబల్స్(Rebels) గెలిస్తే ఫలితాలు వచ్చిన మరుక్షణమే సొంత గూటికి చేరిపోతుంటారు. కానీ పిఠాపురంలో మాత్రం ఈ తిరుగుబాటు అభ్యర్థులు ఏ పార్టీ నాయకత్వానికీ లొంగకుండా తమ సత్తా చాటారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఈ రెబల్స్ గెలుపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రమంతా ఒకలా ఉంటే, పిఠాపురంలో మాత్రం పార్టీలకంటే రెబల్సే పవర్ ఫుల్ అనిపించుకోవడం వెనుక అసలు ఆంతర్యం ఏంటోనని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.