``ఈ రాష్ట్రానికి కేసీఆర్ అవసరమా?`` అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా హకీంపేటలో సోమవారం సాయంత్రం నిర్వహించిన రైతన్న ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాలన నుంచి కేసీఆర్ పార్లమెంటుకు పోటీచేసిన సందర్భం వరకు.. అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అప్పులను ప్రధానంగా ప్రస్తావించారు. మిగులు రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో దింపారని.. ఫలితంగా ఏటా 80 వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతున్నామని చెప్పారు.
అదేసమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయన వల్ల ఏదో మేలు జరుగుతుందని అందరూ అనుకున్నారని.. కానీ, గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. పైగా గజ్వేల్‌ను ఎంచుకుని ఇక్కడి వారిని అపహాస్యం చేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని ఆక్షేపించారు. ప్రతి విషయంలోనూ విఫలమయ్యారని తెలిపారు. ఉద్యోగులకు ఏ నాడూ 1న జీతాలు ఇవ్వలేదని.. దీంతో ఉద్యోగులు కూడా అప్పులు చేసుకునే పరిస్థితిని కల్పించారని అన్నారు. తమ హయాంలో 1నే జీతాలు ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.
టైం ప్రకారం ఇస్తున్నాం..
కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలను, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన సొమ్మును, అలానే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను కూడా సమయం ప్రకారమే ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు ఏటా 80 వేల కోట్ల రూపాయల మేరకు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు లక్షల కోట్లు దీనికే వెచ్చించామన్నారు. ఈ నిధులతో ఒక ప్రాజెక్టు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. ``ప్రజలను పట్టించుకోలేదు.. కుటుంబాన్ని మాత్రమే పోషించారు. వారికి మాత్రమే పదవులు పందేరం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తారని ప్రజలు ఓటేస్తే.. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. అప్పుల బాటలో తీసుకువెళ్లారు. ఇలాంటి కేసీఆర్ ఈ రాష్ట్రానికి అవసరమా?`` అని సీఎం రేవంత్ రెడ్డి గద్దించారు.