మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా 'హే రామ్' అంటూ మరో రాజకీయ నాటకానికి తెరతీశారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు హఠాత్తుగా 'హే రామ్' అనే మాట ఎందుకు గుర్తొచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి అపచారం జరిగిందని గుర్తు చేశారు.
ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారే తప్ప, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏనాడైనా అక్కడికి వెళ్లి 'హే రామ్' అన్నారా అని ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు గానీ, అమ్మవారి ఆలయంలో వెండి సింహాలు దొంగిలించబడినప్పుడు గానీ జగన్ మోహన్ రెడ్డికి 'హే రామ్' గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఏనాడైనా అంతర్వేది వెళ్లి పరిస్థితిని సమీక్షించారా అని నిలదీశారు. తనకు రాజకీయ అవకాశం కావాలనుకున్నప్పుడు మాత్రమే 'హే రామ్', 'యేసుప్రభువు' లేదా 'మహమ్మద్ ప్రవక్త' గుర్తొస్తారని, రాజకీయ అవసరాల కోసం మతాలను వాడుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. గతంలో ఇంట్లోనే గుడి సెట్టింగ్ వేసుకోవడం, ఆలయాల్లో తీర్థం ఇస్తే కింద పారబోయడం వంటి ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
తాజాగా కాదంబరి గ్రామంలోని ఆలయ ఘటనను, ఆంజనేయ స్వామి విగ్రహాల అంశాన్ని అడ్డం పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. జగన్ డైరెక్షన్‌లో తిరుపతిలో మాట్లాడుతున్న భూమన కరుణాకర్ రెడ్డికి అధికారం పోగానే దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు. తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ పద్ధతిలో జరిపించిన వ్యక్తిని, హిందూ ధర్మంపై విశ్వాసం లేకుండా శ్రీవారిని ఉద్దేశించి అత్యంత హేయమైన, నోటితో చెప్పలేని వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించిన ఘనత వైయస్సార్, జగన్ మోహన్ రెడ్డిలకే దక్కుతుందని బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి నియామకాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు కొందరు వైసీపీ నేతలు, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి ఏదో ప్రపంచమంతా మునిగిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అధికారిక రికార్డులు పరిశీలిస్తే అసలు నిజం ఏమిటో ప్రజలందరికీ స్పష్టమవుతుంది. భక్తికి గౌరవం ఇవ్వడం, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం అనే రెండు ప్రధాన సూత్రాలపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అలిపిరి ఘటన తర్వాత దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన పునర్జన్మను ప్రజల సేవకు, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్ని మతాలను గౌరవిస్తూనే, హిందూ ధర్మానికి ఎటువంటి అపచారం జరగకుండా కాపాడే బాధ్యతను ఆయన తీసుకున్నారు.
సుమారు 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు నిర్మించుకున్న ఈ ఆలయాన్ని 2010లో దేవాదాయ శాఖ (ఎండోమెంట్) తన ఆధీనంలోకి తీసుకుంది. 2023 అక్టోబర్ 20వ తేదీన ఎన్ హెచ్-716 (NH-716) రహదారి విస్తరణ కోసం ఈ ఆలయ భూమిని సేకరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే. అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదా? తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడటంలో ఒలింపిక్స్ పోటీలు పెడితే వైసీపీ నేతలకు కచ్చితంగా బంగారు పతకం వస్తుంది. పనులను సగంలో వదిలేయడం గత ప్రభుత్వానికి అలవాటైతే, వాటిని బాధ్యతతో పూర్తి చేయడం చంద్రబాబు నాయుడు గారి నైజం.
గతంలో నేషనల్ హైవే (NHAI) అధికారులు నిధులు విడుదల చేయకపోయినా, కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ నిర్మాణం కోసం సుమారు రూ. 59 లక్షలకు పైగా నిధులను మంజూరు చేయించింది. అంతేకాకుండా, ఆలయం కోసం సుమారు 2,500 గజాల స్థలాన్ని కేటాయించి, తాత్కాలిక ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. మంజూరైన రూ. 59 లక్షల నిధులను ఆలయ అభివృద్ధి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో భద్రపరిచారు. 2026 నవంబర్ 22న గ్రామస్తులు, ఆలయ అర్చకులు, ఈవో గారి సమక్షంలో పూర్తి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, సంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎన్ హెచ్ ఏ ఐ నిర్మించిన తాత్కాలిక గదిలోకి తరలించి, నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
త్వరలోనే శాశ్వత ఆలయ నిర్మాణ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడా ఆలయాన్ని కూల్చివేయడం గానీ, విగ్రహాలను అగౌరవపరచడం గానీ జరగలేదు. గ్రామస్తులందరూ సంతోషంగా, సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అన్నీ సవ్యంగా జరుగుతుంటే తమ ఉనికి ఉండదనే భయంతోనే వైసీపీ నేతలు లేనిపోని వివాదాలు సృష్టిస్తూ, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నాము.
రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై సాగవని, ప్రతి అంశం సీసీ కెమెరాలు, అధికారిక రికార్డుల ద్వారా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తోందని బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. శ్రీశైలం ఆలయ లడ్డూ ప్రసాదంలో మేకు పెట్టి, అలాగే విజయవాడ ఆలయ లడ్డూలో బొద్దింకను పెట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అయితే, నేడు ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉండటంతో ఆ కుట్రలన్నీ రహస్య కెమెరాల్లో రికార్డై దొరికిపోయాయని, దొరకగానే మాట మార్చారని ఆయన పేర్కొన్నారు. తిరుపతి క్యూ లైన్లలో కాకినాడకు చెందిన వైసీపీ కార్యకర్తను పెట్టి భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు పట్టుకున్నప్పుడు పార్టీ ఆదేశాలతోనే తాను అలా చేశానని ఆ కార్యకర్త ఒప్పుకుని క్షమాపణ కోరడంతో వదిలేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
అలాగే, ఓ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగిలించిన ఘటనలో పోలీసులు కేవలం 18 గంటల్లోనే ఒంగోలులో నిందితులను పట్టుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు ఎక్కడ ఎలాంటి విధ్వంసాలకు, కుట్రలకు ప్రయత్నించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వాటిని సాగనీయకుండా అడ్డుకుంటోందని బుచ్చి రాంప్రసాద్ అన్నారు. భక్తి లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం 'హే రామ్' అంటూ దేవుడి పేరును వాడుకున్నందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని, పులివెందుల ఎన్నికల్లోనూ ఆ పరిస్థితి కనిపించిందని ఆయన విమర్శించారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని, ఇతర మతాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మాని, వాటికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. ఆలయ భూసేకరణ విషయంలో కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. 2023లో వైసీపీ హయాంలోనే ఆ స్థల సేకరణ జరిగిందనే రికార్డులను తాము బయటపెట్టామని, గత ప్రభుత్వం వదిలేసిన పనులను పూర్తి చేయడంలో భాగంగానే నేడు ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పాత రోజుల్లో లాగా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలనే 'గోబెల్స్ ప్రచారాలను' నేటి తరం ప్రజలు నమ్మరని, ప్రభుత్వ వద్ద ప్రతిదానికీ స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. కరుణాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, తప్పును ఒప్పుకోవాలని ఆయన హితవు పలికారు.