తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 5 నెల‌లు వాయిదా.!

admin
Published by Admin — November 28, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒకేసారి ఎన్నికల (జమిలీ) అంశం కొత్త చర్చకు దారితీసింది. 2028 డిసెంబర్‌లో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఐదు నెలల పాటు వాయిదా పడి, 2029 మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్(MP Dr. K. Laxman) స్వయంగా పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత తెలంగాణ(Telangana) అసెంబ్లీ పదవీకాలం 2028 డిసెంబర్ 8తో ముగియనుంది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు లేదా ఏడాది తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి 2029లో ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్రం ఆలోచనగా లక్ష్మణ్ వివరించారు. ఒకవేళ అసెంబ్లీ గడువు ముగిసి ఎన్నికలు ఆలస్యమైతే, మధ్యంతర కాలంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డాక్టర్ లక్ష్మణ్ తప్పుబట్టారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దని దక్షిణాది రాష్ట్రాలు కోరినట్లే, జనాభా ఆధారంగానే సీట్లు పెంచాలని ఉత్తర భారత ప్రజలు ఆందోళనకు దిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే, జీడీపీ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న వాదన ఆచరణ సాధ్యం కాదని, ప్రతి ఏడాది జీడీపీ మారుతున్నందున ఏటా డీలిమిటేషన్ చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రతిపాదించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చే ప్రజానుకూల బిల్లులను ఇండియా కూటమి పార్టీలు అనవసరంగా అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

Tags
One Nation One Election MP K Laxman Telangana Assembly Elections BJP Revanth Reddy Delimitation
Recent Comments
Leave a Comment

Related News